Begin typing your search above and press return to search.

బాలరాముడికి పొదిగిన ఆభరణాలు, వాటి విశిష్టతలు ఇవే!

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Jan 2024 3:51 AM GMT
బాలరాముడికి పొదిగిన ఆభరణాలు, వాటి విశిష్టతలు ఇవే!
X

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరాముడు అయోధ్యలో కొలువుదీరారు. ఈ మహాద్భుత ఘట్టాని చూసిన భత్కులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరని రీతిలో నిర్మించిన భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరాడు!

అయితే ప్రాణప్రతిష్ఠకు ముందు నుంచే బాలరాముడి విగ్రహ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై శ్రీరామ జన్మభూమి సీరియస్ అయ్యిందని, విచారణకు ఆదేశించిందని కూడా కథనాలొచ్చాయి! కళ్లకు గంతలు లేని ఫోటోలు ముందుగా ఎలా బయటకు వచ్చాయనే చర్చ బలంగా నడిచింది.

ఆ సంగతి అలా ఉంటే... ప్రాణప్రతిషట సమయంలో బాలరాముడు పూర్తిగా ఆభరణాలతో అలంకారంలో మెరిసిపోతూ కనిపించారు. ఈ సందర్భంగా... రాముడి విగ్రహానికి అలంకరించిన ప్రతి ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉందంటూ... ఆ వివరాలను, విశేషాలన్ను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

అవును... నవనిర్మిత రామమందిరంలో కొలువైన బాల రాముడు ధరించిన ఆభరణాలకు ఒక్కో విశిష్టత ఉందని చెబుతూ... శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... కిరీటం, కౌస్తుభ మణి, విజయమాల, మొదలైన ఆభరణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...!

ఇందులో ప్రధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాటిలో మొదటిది శీరామచంద్రమూర్తి ధరించిన "కిరీటం". ఈ కిరీటం సూర్యదేవుని చిహ్నంతో ఉంది. కెంపులు, వజ్రాలను పొందుపరిచిన ఈ బంగారు కిరీటం ఉత్తర భారత సంప్రదాయంతో చేశారు. దీని మధ్యలో సూర్యుడి చిహ్నం, కుడి వైపున ముత్యాల తంతువులను పెట్టారు.

ఇక.. బాలరాముడి విగ్రహ హృదయ భాగంలో కెంపు, వజ్రాలతో పొదగబడిన "కౌస్తుభ మణి" ఉంది. పురాణ గ్రంధాల ప్రకారం.. విష్ణువు అన్ని అవతారాల్లోనూ ఈ రత్నాన్ని హృదయ స్థానంలో ధరించారని చెబుతారు. బాలరాముడి విగ్రహంలో అతి పెద్ద హారం "విజయమాల" ఉంది. ఇది కెంపులు పొదిగి ఉంటుంది.

ఇక ఈ విగ్రహ హారాల్లో ఒకటి అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. దీనిని "కాంత" అని అంటారు. అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లతో దీన్ని రూపొందించారు. ఇదే సమయంలో... నాభి పైన "పాదిక" అనే మరొక హారము ఉంది. దీన్ని వజ్రాలు, పచ్చలతో పొదిగి చేశారు. అదేవిధంగా... "కంచి" అనే వజ్రాల కెంపులు, ముత్యాలు, పచ్చలతో పొదిగిన బంగారు "నడుము పట్టీ" కనపడుతుంది.

ఇదే సమయంలో... బాలరాముడి విగ్రహాన్ని ఆర్మ్‌ లెట్స్, కంకణాలు, ఉంగరాలతోనూ అలంకరించారు. ఈ క్రమంలో... ఆయన ఎడమ చేతిలో ముత్యాలు, పచ్చలతో చేసిన బంగారు విల్లు, కుడి వైపున బాణం ఉంది. ఈ విగ్రహ నుదుటిపై వెండి, ఎరుపు తిలకాన్ని వజ్రాలు, కెంపులతో రూపొందించారు.