Begin typing your search above and press return to search.

బెంగళూరు బాంబుపేలుడు.. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు!

రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పెట్టిన నిందితుడికి సహాయం చేసిన వ్యక్తిని షబ్బీర్‌ గా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   13 March 2024 9:01 AM GMT
బెంగళూరు బాంబుపేలుడు.. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు!
X

కొద్ది రోజుల క్రితం ఐటీ నగరం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో బాంబుపెట్టి పలువురు గాయపడటానికి కారకుడైన నిందితుడికి సహాయం చేసిన వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఘటన జరిగిన నాటి నుంచి ఊళ్లు మారుస్తూ తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు బళ్లారి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.

రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పెట్టిన నిందితుడికి సహాయం చేసిన వ్యక్తిని షబ్బీర్‌ గా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇతడు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఉగ్రవాద సంస్థ.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)లో సభ్యుడని తెలుస్తోంది. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో అతడిని అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం.

అయితే, ఈ అరెస్టుపై ఎన్‌ఐఏ అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. రామేశ్వరం కేఫ్‌ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతడు సహకరించాడని చెబుతున్నారు.

మార్చి 1న బెంగళూరులోని బ్రూక్‌ ఫీల్డ్‌ లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 10 గాయపడ్డ సంగతి తెలిసిందే. పేలుళ్లకు నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు నిర్ధారించారు.

రామేశ్వరం కెఫేలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. టోపీ పెట్టుకుని.. ముఖానికి మాస్క్‌ ధరించి అతడు ఉన్నాడు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును కూడా ఎన్‌ఐఏ ప్రకటించింది.

ఈ కేసును కర్ణాటక హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే తొలి అరెస్టు చేసింది.

తాజా అరెస్టు నేపథ్యంలో నిందితుడికి సహకరించిన వ్యక్తి నుంచి కీలక విషయాలను ఎన్‌ఐఏ అధికారులు రాబట్టనున్నారు. దీంతో కేసులో కొంత పురోగతి వచ్చినట్టేనని భావిస్తున్నారు. కెఫేలో బాంబు పెట్టింది ఎవరు? అతడికి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది? ఇందులో షబ్బీర్‌ పాత్ర? ఈ ఘటన వెనుక ఉంది ఎవరు? ఎవరు చెబితే ఈ పనిచేశారు తదితర కోణాల్లో నిందితుడి నుంచి ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నలు రాబడుతున్నారని తెలుస్తోంది.