మనిషి జీవితం నిండు 150-200 ఏళ్లు.. రాందేవ్ బాబా చెప్పేది నమ్మాలి
’నిండు నూరేళ్లు చల్లగా ఉండు’.. ఇదీ మన పెద్దలు చిన్నవారిని దీవించే సమయంలో చెప్పేమాట. దీని ఉద్దేశం మనిషి జీవిత కాలం వందేళ్లు అని ప్రామాణికంగా చెప్పడం.
By: Tupaki Desk | 2 July 2025 1:00 AM IST’నిండు నూరేళ్లు చల్లగా ఉండు’.. ఇదీ మన పెద్దలు చిన్నవారిని దీవించే సమయంలో చెప్పేమాట. దీని ఉద్దేశం మనిషి జీవిత కాలం వందేళ్లు అని ప్రామాణికంగా చెప్పడం. అంతేకాక మనం కూడా మనిషి జీవిత కాలం వందేళ్లే అని ఫిక్సయిపోయాం. ఎవరైనా అంతకుమించి బతికితే ‘శతాధికులు’ అంటూ గొప్పగా చెప్పుకొనే పరిస్థితికి వచ్చాం. కానీ, యోగా గురువు రాందేవ్ బాబా మాత్రం మనిషి జీవితం వందేళ్లు కాదు.. నిండు 150-200 ఏళ్లు అంటున్నారు.
గతంలో తాను ఎన్నోళ్లు బతుకుతానో చెప్పి.. (వందేళ్లకు పైబడే) అందరినీ ఆశ్చర్యపరిచారు రాందేవ్ బాబా. అయితే, ఆ తర్వాత ఒకటీ అరా ప్రమాదాలకు గురయ్యారు. కొన్నేళ్ల కిందట తన యోగా ఆసనాలతో భారత దేశాన్ని కదిలించారు బాబా రాందేవ్. అలాంటి వ్యక్తి ఇటీవలి కాలంలో బాగా లోప్రొఫైల్ లో ఉన్నారు. దీనికితోడు పతంజలి కేసులో ఆయనకు ఎదురుదెబ్బలు కూడా తగిలాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు రాందేవ్ బాబా. ఏపీలాంటి ప్రదేశం భూమ్మీద ఎక్కడా లేదంటూ పొగిడేశారు కూడా. మరోవైపు మనిషి జీవిత కాలం వందేళ్లు కాదని 150-200 ఏళ్ల వరకు ఉంటుందని వ్యాఖ్యానించారు. మనం మెదడు, గుండె, కళ్లు, కాలేయంపై అధిక ఒత్తిడి పెడుతున్నామని తెలిపారు. ప్రజలు వందేళ్ల కాలానికి తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లలోనే తినేస్తున్నట్లు చెప్పారు. ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి మనిషి జీవితానికి అవసరమని.. 60 ఏళ్లు దాటి నతాను యోగా, మంచి ఆహారం, జీవనశైలితో ఫిట్ గా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇటీవల ఆకస్మికంగా మరణించిన నటి షఫాలీ జరీవాలా ఉదంతం తీవ్ర చర్చనీయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె మరణానికి వయసు పైబడకుండా వాడే మందులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు నాలుగేళ్ల కిందట గుండెపోటు చనిపోయిన నటుడు సిద్ధార్థ్ శుక్లా గురించి రాందేవ్ బాబా స్పందించారు. మనిషి శరీరం అంతర్గతంగా బలంగా ఉండాలన్నారు. అందులోని ప్రతి కణానికి సహజ జీవిత కాలం ఉంటుందని.. దానిని అధికంగా ఒత్తిడి పెడితే అది అంతర్గతంగా ఇబ్బందులు పెడుతుందని, గుండెపోటు వంటివి అందుకే వస్తాయని రాందేవ్ బాబా విశ్లేషించారు.
