Begin typing your search above and press return to search.

రామ‌గుండంలో త‌లోదారి.. క‌విత‌ను నిల‌బెట్టాలంటోన్న నేత‌లు

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఏడాదిలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఫోక‌స్ పెట్టారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:30 PM GMT
రామ‌గుండంలో త‌లోదారి.. క‌విత‌ను నిల‌బెట్టాలంటోన్న నేత‌లు
X

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఏడాదిలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఫోక‌స్ పెట్టారు. ఈ నెల మూడో వారంలో ఆయ‌న తొలి జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత పార్టీ నేత‌ల మ‌ధ్యే విభేదాలు మాత్రం కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మారాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌గుండం కూడా ఒక‌టి. ఇప్పుడు ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చంద‌ర్ సొంత పార్టీ నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

కోరుకంటి చంద‌ర్ అవినీతిప‌రుడ‌ని సొంత పార్టీ నేత‌లే ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాజీ మేయ‌ర్ కొంక‌టి ల‌క్ష్మీనారాయ‌ణ‌, టీబీజీకేఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి, పాల‌కుర్తి జ‌డ్పీటీసీ స‌భ్యురాలు కందుల సంధ్యారాణి, పాతిపెల్లి ఎల్ల‌య్య, మ‌నోహ‌ర్‌రెడ్డి లాంటి బీఆర్ఎస్ అస‌మ్మ‌తి నాయ‌కులు గోదావ‌రిఖ‌నిలో విలేక‌ర్ల స‌మావేశం పెట్టి మ‌రీ ఈ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే అనుచ‌రులు బ్రోక‌ర్ల లాగా మారి, ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని 750 మంది నుంచి వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

రామ‌గుండంలో పార్టీని బ‌తికించుకోవ‌డానే తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఈ అస‌మ్మ‌తి నేత‌లు చెప్పారు. ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను తీసుకెళ్లేందుకు ఈ నెల 6న ప్ర‌జా ఆశీర్వాద స‌భ నిర్వ‌హించ‌నున్నామ‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద‌ర్‌కు మాత్రం టికెట్ ఇవ్వొద్ద‌ని డిమాండ్ చేస్తున్నారు. టీబీజీకేఎస్ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత‌ను నిల‌బ‌డితే గెలిపించుకుంటామ‌ని మ‌రీ చెప్పారు. లేదంటే త‌మ అయిదుగురిలో ఒక‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని కేసీఆర్‌ను కోరుతున్నారు. మ‌రి రామ‌గుండంలోని ఈ అసంతృప్తిని కేసీఆర్ ఎలా త‌గ్గిస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.