Begin typing your search above and press return to search.

రామ్మోహన్...చరితార్ధుడు !

కింజరాపు రామ్మోహన్ నాయుడు చరితార్ధుడు కాబోతున్నారు. ఉత్తరాంధ్రా రాజకీయ చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని అంటున్నారు.

By:  Satya P   |   19 July 2026 10:00 AM IST
రామ్మోహన్...చరితార్ధుడు !
X

కింజరాపు రామ్మోహన్ నాయుడు చరితార్ధుడు కాబోతున్నారు. ఉత్తరాంధ్రా రాజకీయ చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఉత్తరాంధ్రా రీజియన్ లో భోగాపురంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం అన్నది బిగ్ అచీవ్ మెంట్ అని అంటున్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఎంతో మందికి ఈ తరహా బంగారు అవకాశాలు అయితే రావు అనే అంటున్నారు. తమ జీవిత పర్యంతం ప్రజా సమస్యల మీద పోరాడినా కూడా తమ ప్రాంతానికి మేలు చేసే విషయంలో ఎంతో పట్టుదలగా ప్రయత్నాలు చేసినా తాము అధికారంలో ఉండగా వాటి ఫలితాలను జనాలకు అందించి ఆ వేదిక మీద తాము నిలిచి ఉండడం అంటే రేఫ్ ఫీట్ అనే చెప్పాలి. ఇపుడు దానిని రామ్మోహన్ నాయుడు సాధించారు.

శిలాఫలకం మీద ఘనంగా :

ఇక భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఆగస్టు 1వ తేదీన మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు శ్రీకారం చుట్టుకోబోతోంది. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా వేదిక మీద నిలిచి ఉంటారు. ఆయన పేరు శిలా ఫలకం మీద ఘనంగా లిఖించబడుతోంది. దాంతో ఆయన ఇక మీదట ఏమి చేసినా మరింతగా సాధించినా కూడా తన జీవిత కాలానికి ఆ మాటకు చెప్పాల్సి వస్తే కింజరాపు కుటుంబానికే తరగని కీర్తిగా భోగాపురం ఎయిర్ పోర్టుని చూపించుకోవచ్చు అని అంటున్నారు.

విస్తరణ ఊహాగానాల మధ్య :

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని గత రెండు నెలలుగా ఊహాగానాలు వచ్చాయి. అదే కనుక జరిగి ఉంటే కనుక ఈపాటికి రామ్మోహన్ శాఖ వేరేదిగా ఉండేదని అంటున్నారు. ఆయనకు విస్తరణలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే జాతీయ స్థాయిలో అనేక సమీకరణలు వ్యూహాల మధ్య కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అవి ఆగస్టు 13 దాకా జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తి అయ్యేంతవరకూ విస్తరణ అన్నది ఉండదని చెబుతున్నారు. ఈలోగానే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం కావడంతో రామ్మోహన్ కి ఇది అరుదైన గౌరవంగా చెబుతున్నారు.

ఉత్తరాంధ్రా నుంచి :

ఈ మధ్యనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ తాను భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. సంబంధిత శాఖా మంత్రిగానే కాకుండా ఉత్తరాంధ్రా నుంచి ప్రతినిధిగా కూడా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పారు. ఇపుడు ఆయన కోరిక తీరబోతోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో అంటే 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్ర కు చెందిన ఎంపీ విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అశోక్ గజపతిరాజు ఈ బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో పునాది రాయి పడితే మళ్ళీ అదే ఉత్తరాంధ్ర కు చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు ఓపెన్ కావడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని అంటున్నారు.