12 గంటల పాటు పోలీస్ స్టేషనులో బడా డైరెక్టర్.. ఎందుకంటే?
మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఒంగోలు పోలీసుస్టేషనుకు వచ్చిన ఆర్జీవిని రాత్రి 11.30 గంటల వరకు పోలీసులు ప్రశ్నించారు.
By: Tupaki Desk | 13 Aug 2025 10:58 AM ISTప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాలవర్మను ఒంగోలు పోలీసులు మంగళవారం సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఆరోపణలతో దర్శకుడు ఆర్జీవీని పోలీసులు సుమారు 12 గంటల పాటు ప్రశ్నించారు. గతంలో ఆర్జీవీ పోస్టులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై ఆర్జీవీ కోర్టును ఆశ్రయించగా, నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.
మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఒంగోలు పోలీసుస్టేషనుకు వచ్చిన ఆర్జీవిని రాత్రి 11.30 గంటల వరకు పోలీసులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేయమని ఎవరు చెప్పారు? అంటూ ఆర్జీవీని పోలీసులు ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 12 గంటల పాటు పోలీసుస్టేషనులోనే ఉన్న ఆర్జీవీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా, మరికొన్నింటిపై మౌనం వహించినట్లు చెబుతున్నారు. విచారణకు ముందు వర్మ ఫోన్ ను పోలీసులు తీసుకున్నారని, దాదాపు 50 ప్రశ్నలు వేశారని చెబుతున్నారు. ఇందులో వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో ప్రదర్శించినందుకు గాను వర్మకు చెల్లించిన రూ.2 కోట్లపైనా ప్రశ్నలు వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఒంగోలు తాలూకా పోలీసుస్టేషనులో జరిగిన ఈ విచారణలో రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది దర్శకుడు ఆర్జీవీని ప్రశ్నించారు. 2024లో ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ నాయకుడు ఎం.రామలింగం ఫిర్యాదు చేయడంతో మద్దిపాడు పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిపై ఫిబ్రవరి 7న ఆయనను పోలీసులు తొలుత ప్రశ్నించారు. అయితే తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని, కేసు కొట్టివేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించడంతో గత నెల 22న ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా పోలీసులు నోటీసులు పంపారు. దీంతో మంగళవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనకు స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశారు.
