ఒక్క సీటు కోసం టీడీపీలో అంత క్యూ ఉందా ?
తెలుగుదేశం పార్టీ అంటే పదవులకు పెట్టింది పేరు. ఎంతో మందికి పదవులు అందించి అందలాల మీద కూర్చోబెట్టిన పార్టీగా టీడీపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది.
By: Satya P | 8 Dec 2025 8:00 AM ISTతెలుగుదేశం పార్టీ అంటే పదవులకు పెట్టింది పేరు. ఎంతో మందికి పదవులు అందించి అందలాల మీద కూర్చోబెట్టిన పార్టీగా టీడీపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇపుడు చూస్తే టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. సెంట్రల్ లో ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉంది. దాంతో పదవులే పదవులు అన్నట్లుగా పరిస్థితి ఉంది. విపక్షంలోని వైసీపీకి కేవలం పదకొండు మందే ఎమ్మెల్యేలు ఉండడంతో రాజ్యసభ కానీ శాసనమండలి కానీ టీడీపీ కూటమికే అన్ని సీట్లు దక్కబోతున్నాయి.
నాలుగు ఖాళీలు :
ఇక మరి కొద్ది రోజులలో 2026 వచ్చేస్తోంది. దాంతో పాటు అదే ఏడాది జూన్ లో రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు ఉన్నాయి. ఏపీ నుంచి నాలుగు ఖాళీలు అవుతాయి. అందులో మూడు వైసీపీకి చెందినవి ఉంటే ఒకటి టీడీపీది ఉంది. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ రిటైర్ కానున్నారు. టీడీపీ నుంచి సానా సతీష్ పదవి కూడా పూర్తి అవుతుంది. నిజానికి ఈ సీటు వైసీపీ నుంచి నెగ్గిన మోపిదేవి వెంకట రమణకు చెందినది. ఆయన మధ్యలో తన పదవికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీలో చేరారు. దాంతో సానా సతీష్ ని ఎంపిక చేసి గత ఏడాది పంపించారు. ఇపుడు ఆయనకు కూడా మిగిలి ఉన్న ఆ పదవీ కాలం కంప్లీట్ అవుతోంది.
ఇదీ లెక్కగా :
ఈ నాలుగు రాజ్యసభ సీట్లలో లెక్క ప్రకారం చూస్తే టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి వెళ్తాయని అంటున్నారు. పరిమళ్ నత్వానీ సీటులో బీజేపీ అభ్యర్థి రావచ్చు అని చెబుతున్నారు. ఇక జనసేన ఇప్పటిదాకా రాజ్యసభలో ఖాతా తెరవలేదు, దాంతో ఈసారి ఆ పార్టీ నుంచి అభ్యర్ధి కచ్చితంగా ఉండనున్నారు. ఇక టీడీపీ నుంచి మిగిలినవి రెండు సీట్లు అయితే అందులో సానా సతీష్ పదవీ కాలం కేవలం ఏణ్ణర్ధానికే ముగుస్తోంది కాబట్టి రెన్యూల్ చేస్తారు అని అంటున్నారు. అయితే ఇక మిగిలింది కేవలం ఒకే ఒక్క రాజ్యసభ సీటు. దాంతో ఆ ఒక్క రాజ్యసభ సీటు కోసం అయితే టీడీపీలో ఎన్నడూ లేనంతంగా గట్టి పోటీ ఉందని అంటున్నారు.
ఎంతో మంది ఆశావహులు :
తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో మొదటి పేరుగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ది ఉంది. ఆయన 2014, 2019లలో రెండు సార్లు గుంటూరు నుంచి లోక్ సభ ఎంపీగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తానే తప్పుకున్నారు. ఆయన రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు నారా లోకేష్ లకు అత్యంత సన్నిహితులుగా ఆయనకు పేరు ఉంది. అదే విధంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఈ చాన్స్ తనకు ఇవ్వాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఏడున్నర పదుల వయసులో ఉన్న రామకృష్ణుడికి ఇపుడు కాకపోతే 2028 దాకా వేచి ఉండలేరు అని కూడా చెబుతున్నారు. పైగా ఆయన సైతం టీడీపీకి దశాబ్దాలుగా సేవలు అందించి ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు.
అదృష్టవంతులు ఎవరో :
ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు ఐ టీడీపీలో కీలక నేత అయిన చింతకాయల విజయ్ పాత్రుడు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన 2024లో అనకపాల్లి ఎంపీ సీటు ఆశించారు. కానీ కూటమి పార్టీల పొత్తుతో అది దక్కకుండా పోయింది. మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు కూడా ఈ టికెట్ రేసులో ఉంది అని అంటున్నారు. ఇక 2016 నుంచి ఎపుడు రాజ్యసభ ఎన్నికలు జరిగినా కామన్ గా టీడీపీలో వినిపించే పేరు వర్ల రామయ్య. ఆయన కూడా ఈ చాన్స్ తనకే ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. అలాగే ఒకనాడు రాజ్యసభలో టీడీపీ నేతగా వ్యవహరించిన కంభంపాటి రామ్మోహన్ రావు తనకు అవకాశం ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అలాగే పలువురు బిగ్ షాట్స్ రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా రాజ్యసభకు వెళ్ళాలని చూస్తున్నారు. మొత్తం మీద ఇంకా ఏడెనిమిది నెలలు వ్యవధి ఉండగానే ఇప్పటి నుంచే చాలా మంది నేతలు ఒకే ఒక్క రాజ్యసభ సీటు కోసం కర్చీఫ్ వేస్తున్నారు. మరి పెద్దల దయ ఎవరి మీద పడుతుందో చూడాల్సి ఉంది.
