Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌కు న‌లుగురు.. రాజ‌కీయాల‌కు సుదూరం!

తాజాగా న‌లుగురు వ్య‌క్తుల‌ను రాష్ట్ర‌ప‌తి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు.

By:  Tupaki Desk   |   14 July 2025 9:36 AM IST
రాజ్య‌స‌భ‌కు న‌లుగురు.. రాజ‌కీయాల‌కు సుదూరం!
X

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం అంటేనే.. పెద్ద రాజ‌కీయం!. ఒక్క‌సీటు ఖాళీ అయితేనే..ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న‌ది రాజ‌కీయ పార్టీల‌కు పెను ప‌రీక్ష‌. అలాంటిది తాజాగా ఎలాంటి రాజ‌కీయ వాస‌న‌లు.. రాజ‌కీయ ప్ర‌మేయాలు లేని న‌లుగురు వ్య‌క్తుల‌(ఒక్క‌రు త‌ప్ప‌) ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తూ.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. స‌హ జంగా రాజ్య‌స‌భ అయినా.. లోక్‌స‌భ అయినా.. రాజ‌కీయాల‌కు అతీతం కాదు. ముఖ్యంగా రాజ్య‌స‌భ అయితే.. స‌భ్యుల ఎంపిక పార్టీలు, ప్ర‌భుత్వాల చేతిలోనే ఉంటుంది. నామినేష‌న్ లేదా.. అసెంబ్లీ కోటాలో స‌భ్యుల‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపిస్తారు.

సో.. రాజ్య‌స‌భ సీటు కూడా అంతే ప్రాధాన్యం సంత‌రించుకుంది. కానీ, తాజాగా న‌లుగురు వ్య‌క్తుల‌ను రాష్ట్ర‌ప‌తి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు. వీరిలో ఒక్క‌రు త‌ప్ప‌.. మిగిలిన‌ ముగ్గురు కూడా.. వారి వారి రంగాల్లో నిష్ణాతులు త‌ప్ప‌.. రాజ‌కీయ వాస‌న‌ల‌కు, వివాదాల‌కు క‌డుదూరంగా ఉన్నారు. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. వాస్త‌వానికి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు.. కేంద్రంలోని బీజేపీ కూట‌మిలో ఉన్న టీడీపీ, జేడీయూ(బిహార్ పాలిత ప‌క్షం) ఎదురు చూస్తున్నాయి. వారి త‌ర‌ఫున నాయ‌కులు కూడా రెడీగా ఉన్నారు. సో.. వీరిని రాష్ట్ర‌ప‌తి కోటాలో నామినేట్ చేయొచ్చు.

కానీ.. మోడీ స‌ర్కారు ఈ సారి భిన్న‌మైన వైఖ‌రిని తీసుకుంది. పోనీ.. త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్, బిహార్‌ వంటి ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న రాష్ట్రాల‌నుంచి కూడా తీసుకోక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేసింది. వ‌చ్చే ఏడాది ఈ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. కాబ‌ట్టి ఇక్క‌డి రాజ‌కీయాల‌ను ప్రభావితం చేసేలా కూడా రాజ్య‌స‌భ ఎంపిక‌లు జ‌రిగి ఉంటే వేరేగా ఉండేది. కానీ, అలా కూడా నామినేట్ చేయ‌కుండా.. ఇత‌ర రంగాల‌కు చెందిన వారిని.. పెద్ద‌ల స‌భ‌కు పంపిస్తుండ‌డం ఆశ్చ‌ర్య క‌రంగానే కాకుండా.. ఏదో వ్యూహాత్మ‌క అడుగుగా కూడా రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఎవ‌రెవ‌రు.. ఎక్క‌డ నుంచి?

తాజాగా రాష్ట్ర‌ప‌తి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన వారిలో ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్, సదానందం ఉన్నారు. ఒక్క స‌దానందం మిన‌హా మిగిలిన ముగ్గురికి రాజ‌కీయాల‌తో జోక్యం లేదు. వారి ప్రొఫైల్ ఇదీ..

+ ఉజ్వల్ నికమ్(పద్మశ్రీ అవార్డీ): 26/11 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ అజ్మల్ కసబ్ కేసు కోసం ప్రత్యేకంగా నియమితులైన‌ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌. 1993 ముంబై పేలుళ్లు, గుల్షన్ కుమార్, ప్రమోద్ మహాజన్ హత్య కేసులు వాదించిన న్యాయ‌వాది. ఈయ‌న మ‌హారాష్ట్ర‌కు చెందిన‌వారు.

+ హర్షవర్ధన్ శ్రింగల్: మాజీ ఇండియన్ ఫారిన్ సెక్రెటరీ భారత్ లో జరిగిన జీ-20 సమావేశాల ఛీఫ్ కోఅర్డినేటర్. శ్రింగ‌ల్ కూడా ముంబైకి చెందిన వ్య‌క్తే కావ‌డం గ‌మ‌నార్హం.

+ మీనాక్షి జైన్(పద్మశ్రీ అవార్డీ): భారతదేశ చారిత్రక, రాజకీయ శాస్త్రవేత్త, ప్రఖ్యాత గార్గీ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం లో చరిత్ర విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రముఖ జ‌ర్న‌లిస్టు, కాల‌మిస్టు గిరిలాల్ జైన్ కుమార్తె. ఈమె ఢిల్లీకి చెందిన వారు.

+ సదానందన్: కేర‌ళ‌కు చెందిన‌ సి.సదానందన్ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు. అభ్యుద‌య వాది. 1994 లో సీపీఎం కార్యకర్తల దాడిలో.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే.. తన రెండు కాళ్ళను పోగొట్టుకొన్నారు. కొన్నాళ్ల‌కు ఆయ‌న బీజేపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు. ఈయ‌న ఒక్క‌రు త‌ప్ప మిగిలిన వారికి రాజకీయాల‌తో ప్ర‌మేయం లేదు.