Begin typing your search above and press return to search.

లేటుగా అయినా లేటెస్టు వార్నింగ్ ఇచ్చేసిన రాజ్ నాధ్

భారత దేశానికి వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడులపై తొలిసారి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియస్ గా స్పందించారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:42 AM GMT
లేటుగా అయినా లేటెస్టు వార్నింగ్ ఇచ్చేసిన రాజ్ నాధ్
X

భారత దేశానికి వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడులపై తొలిసారి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియస్ గా స్పందించారు. నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వేటాడి మరీ పట్టుకుంటామని.. నిందితులపై కఠిన చర్యలు ఖాయమని హెచ్చరించారు. సొంత టెక్నాలజీతో రూపొందించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ ను ముంబయి వేదికగా నౌకాదళంలో ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఇటీవల భారత్ కు వస్తున్న వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్ని ప్రస్తావించారు. గుజరాత్ తీరానికి వచ్చిన వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ఫ్లూటోపై డ్రోనో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై భారత నౌకాదళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. అనంతరం ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో సదరు వాణిజ్య నౌక ముంబయికి చేరుకుంది. అయితే.. ఈ దాడి ఇరాన్ భూభాగంపై నుంచి జరిగినట్లుగా అమెరికా రక్షన శాఖ పేర్కొనగా.. దీన్ని ఇరాన్ ఖండించింది.

మరోవైపు ఎంవీ సాయిబాబా పైనా దాడి జరిగిన ఉదంతం చోటు చేసుకుంది. దీంతో.. భారత రక్షణ మంత్రి చేసిన హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దాడికి గురైన నౌకలోని సిబ్బంది మొత్తం క్షేమంగా ఉన్నారు. అయితే.. రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ నౌకలో మొత్తం 20 మంది భారతీయులతో పాటు మొత్తం 21 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. రోటీన్ కు భిన్నంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజ్ నాథ్ చేతల్లో ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాటలకు తగ్గట్లే.. చేతలు సైతం సీరియస్ గా ఉండాలన్న మాట బలంగా వినిపిస్తోంది.