దేశ ప్రజలు అదే కోరుకుంటున్నారు రాజ్ నాథ్ సింగ్ జీ!
భారతదేశంపై పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడానికి ఒక సులువైన మార్గంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 29 May 2025 6:00 PM ISTభారతదేశంపై పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడానికి ఒక సులువైన మార్గంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పీఓకే లోని ఉగ్రశిబిరాలను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో పీఓకేలో ఉన్న ప్రజానికం గురించి రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... పీఓకేలో ఉన్న ప్రజలపై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. పీఓకే ప్రజలు ప్రస్తుతానికి భౌగోళికంగా విడిపోయినా రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్ లో ఏకమవుతారని.. ఆ రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఈ సందర్భంగా.. పీవోకే దానంతట అదే భారత్ లోకి తిరిగి వస్తుందని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.
దీంతో.. ఇదే కదా జీ ప్రతీ భారతీయుడూ కోరుకుంటున్నది అనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో.. పీఓకే లో ఉన్న ప్రజలకు భారత్ తో దృఢమైన సంబంధాలున్నాయని.. అక్కడున్న కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టారని.. గ్రేట్ ఇండియానే మా సంకల్పమని.. మనకు శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యమని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన దేశీయంగా అభివృద్ధి చెందిన వ్యవస్థలు ప్రపంచం మొత్తాన్ని షాక్ కి గురిచేశాయని చెప్పిన రాజ్ నాథ్ సింగ్.. శత్రుకవచాన్ని దాటుకొని వెళ్లగలమని నిరూపించామని అన్నారు. ఈ క్రమంలో.. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశభద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని ప్రూవ్ అయ్యిందని మంత్రి వెల్లడించారు.
మనం ఏమైనా చేయగలమని అయితే.. మనకు బలం, నిగ్రహం మధ్య సమన్వయం తెలుసనే విషయాన్ని ప్రపంచానికి చూపించామని అన్నారు. ఏది ఏమైనా.. ఉగ్రవాద వ్యాపారాన్ని నడపడానికి పెద్ద ఖర్చేం కాదు కానీ.. దానివల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం పాకిస్థాన్ కు ఇప్పుడు అర్ధమైందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
కాగా... ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని ఇటీవల రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పాక్ చర్యలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, తేడా వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
