Begin typing your search above and press return to search.

గోవా నుంచి వచ్చిన రాజేశ్ రెడ్డి.. దొరికిపోయిన రాజ్ కసిరెడ్డి..

By:  Tupaki Desk   |   21 April 2025 11:10 PM IST
గోవా నుంచి వచ్చిన రాజేశ్ రెడ్డి.. దొరికిపోయిన రాజ్ కసిరెడ్డి..
X

మద్యం కుంభకోణంలో ఏపీ పోలీసులు అతిపెద్ద పురోగతి సాధించారు. కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. గత నెల నుంచి పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి మారుపేరుతో గోవా నుంచి వస్తుండగా, పోలీసులకు దొరికిపోయారు. ఇప్పటికే ఆయనను విచారించేందుకు పోలీసులు నాలుగు నోటీసులు జారీ చేశారు. నాలుగో నోటీసు ప్రకారం రాజ్ కసిరెడ్డి రేపు విజయవాడ కమిషనరేట్ లో విచారణకు హాజరుకావాల్సివుంది.

ఏపీ లిక్కర్ స్కాంలో పోలీసులు స్పీడు పెంచారు. విచారణ నిమిత్తం నోటీసులిస్తున్నా, హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన అనుమానితుడు రాజ్ కసిరెడ్డి ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులకు దొరికిపోయారు. రాజేశ్ రెడ్డి అనే మారు పేరుతో గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న రాజ్ కసిరెడ్డిని విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి మారుపేరుతో చెన్నైకి చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు రాజ్ కసిరెడ్డి ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

రాజ్ కసిరెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనమ్మోహన రెడ్డి కి బంధువుగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఏపీ ఐటీ సలహాదారుగా ఆయన పనిచేశారు. అయితే ఆయన పేరుకు ఐటీ సలహాదారు అయినా ఎక్కువగా మద్యం వ్యాపారాన్నే పర్యవేక్షించేవారని అభియోగాలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో మద్యం స్కాం జరిగిందని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది.

ఈ విచారణ ఓ వైపు కొనసాగుతుండగానే, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాం గుట్టు విప్పేశారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డి అంటూ ఆరోపించారు. అంతేకాకుండా రాజ్ కసిరెడ్డి పాత్రపై పూర్తి వివరాలు ఇస్తానని గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జరిగిన విచారణలోనూ విజయసాయిరెడ్డి అదే అంశాన్ని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో మద్యం స్కాంపై రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగిసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అరెస్టు భయంతో పరార్ అయిన రాజ్ కసిరెడ్డి.. కోర్టులో బెయిన్ పిటిషన్ కోసం పోరాడుతున్నారు. ఇదే సమయంలో విచారణకు రమ్మంటూ ఆయనకు నాలుగు నోటీసులు పంపింది సిట్. అయితే ఏ నోటీసుకు స్పందించని రాజ్ కసిరెడ్డి సోమవారం గోవా నుంచి మారు పేరుతో హైదరాబాద్ రాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.