Begin typing your search above and press return to search.

తండ్రి రాజీవ్ గాంధీ అలా...కొడుకు రాహుల్ గాంధీ ఇలా...!

By:  Tupaki Desk   |   4 Oct 2023 11:30 PM GMT
తండ్రి రాజీవ్ గాంధీ అలా...కొడుకు రాహుల్ గాంధీ ఇలా...!
X

ఇప్పటికి సరిగ్గా 33 ఏళ్ళ క్రితం అంటే 1990 ప్రాంతంలో లోక్ సభలో నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన విపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుల ప్రాతిపదికన విభజన చేస్తే దేశం మొత్తం విచ్చిన్నం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి అంటే నాటి ప్రధాని వీపీ సింగ్ మొండితనం నుంచి ఈ దేశాన్ని కాపాడాలని ఆయన గట్టిగా కోరుకున్నారు.

ఇదంతా మండల్ కమిషన్ మీద నాడు పార్లమెంట్ లో చర్చ సందర్భంగా రాజీవ్ గాంధీ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ చేసిన కీలక కామెంట్స్. కులాల ప్రాతిపదికన విభజన ఎంతమాత్రం దేశానికి మంచిది కాదని రాజీవ్ గాంధీ గట్టిగా వాదించారు.

అదే విధంగా కుల ప్రాతిపదికన రాజకీయ నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలనే మండల్ కమిషన్ అభిప్రాయానికి ప్రభుత్వం విలువ ఇస్తుందా అని ప్రశ్నించారు. ఇదంతా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రూపొందించబడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల రహిత సమాజాన్ని నమ్ముతున్నారో లేదో చెప్పే దమ్మూ ధైర్యం ప్రధాని వీపీ సింగ్ కి లేదని రాజీవ్ గాంధీ దుయ్యబెట్టారు. రాజా సాహిబ్ మరోసారి మన సమాజంలో కులాన్ని ప్రవేశపెడుతున్నారని, ఈ చర్య ద్వారా కులం బయటకు పోకుండా దేశంలోనే ఉంటుందని రాజీవ్ గాంధీ వీపీ సింగ్ మీద ఘాటైన విమర్శలు చేశారు.

పాలకులు వేసే ప్రతీ అడుగూ కుల రహిత సమాజం వైపు వెళ్లేలా ఉండాలని ఆన కోరుకున్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు మనం వేస్తున్న అడుగు మన విధానం కులతత్వ సూత్రంతో ఉందని ఆయన నేషనల్ ఫ్రంట్ పాలకుల తీరు మీద మండిపడ్డారు. జాతీయ లక్ష్యంలో భాగం కావాల్సిన అతి ముఖ్య అంశం కులరహిత సమాజం అని రాజీవ్ గాంధీ వాదించారు. రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు వెనుకబడిన తరగతుల మధ్య చాలా స్పష్టంగా వేరు చేసిందని ఆయన గుర్తు చేశారు.

రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యత్యాసాన్ని ఎందుకు చేశారన్నది ఆలోచించాలని ఆ వ్యత్యాసాన్ని కోల్పోరాదని రాజీవ్ అన్నారు. భారత దేశంలో కులాల సంఖ్య చాలా ఎక్కువని ఆయన అంటూ అయినా సరే అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ లక్ష్యం కుల రహిత సమాజంగా ఉండాలని రాజీవ్ కోరుకున్నారు.

మండల్ కమిషన్‌ను అమలు చేసిన తీరు నా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని నా దేశం విడిపోవడం తనకు ఇష్టం లేదని రాజీవ్ అన్నారు. ఇదంతా రాజీవ్ గాంధీకి దేశంలో ఉన్న కులాల మీద ఉన్న భావన. ఆయన కులాలను గౌరవించమని అంటున్నారు. దాని కంటే ముందు మూలాలలోకి వెళ్లి పేదరికాన్ని తొలగించమని కోరారు

మరి ఇన్నేళ్ళ తరువాత అదే కాంగ్రెస్ పార్టీ అదే రాజీవ్ గాంధీ రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ అంటున్నదేంటి అన్నది చూస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేయమని అంటున్నారు. ఈ దేశంలో కుల గణన చేపట్టాలని లేకపోతే తమ ప్రభుత్వం వచ్చి ఆ పని చేస్తుంది అని అంటున్నారు.

మరి తండ్రి రాజీవ్ గాంధీ ఆలోచనలను రాహుల్ అనుసరించడం లేదా అనన్ చర్చ ఈ సందర్భంగా వస్తుంది. నాడు రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ పేరిట రాజకీయ ప్రయోజనాల కోసం వీపీ సింగ్ నాయకత్వాన జనతాదళ్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టారు. ఇపుడు సరిగ్గా అవే మాటలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంటున్నారు.

కుల గణన వల్ల దేశంలో విచ్చిన్నరక పరిస్థితులు ఏర్పడుతాయని రాజీవ్ మాటలను మోడీ వల్లె వేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కుల గణన డిమాండ్ ని నెత్తికెత్తుకుంది. ఇదంతా ఎందుకు అంటే ఈ రోజున దేశంలో సనాతన ధర్మం మీద ఒక చర్చ నడుసోంది. దాన్ని తట్టి లేపిన వారు తమిళనాడు మంత్రి ఉదయ నిధి. డీఎంకే ఇండియా కూటమిలో ఉంది.

ఇక సనాతన ధర్మాన్ని వెనకేసుకుని వచ్చి భారీగా రాజకీయ లబ్దిని పొందేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. దాన్ని అడ్డుకోవడం కోసం లేదా ఆ చర్చను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం కుల గణనను ముందుకు తెచ్చారని అంటున్నారు. అంతే కాదు 2024 జనవరి లో రామమందిరం ప్రారంభం కాబోతోంది. మందిర్ రాజకీయాలు ఎటూ బీజేపీకి మేలు చేస్తాయని అంటారు.

దాంతో దాన్ని కూడా అడ్డుకోవాలని ఇండియా కూటమి నేతలు కులగణన డిమాండ్ ని అందుకున్నారని అంటున్నారు. అంటే మతంతో ఏకీకృతం గా ఓటు బ్యాంక్ బీజేపీకి పోకుండా కుల గణన పేరుతో చెక్ పెడితే తమకు రాజకీయ లాభం అన్నదే ఇండియా కూటమి ఆలోచనలు అని అంటున్నారు. రాజకీయల సంగతి వ్యూహాల విషయం ఎలా ఉన్నా నాడు మండల్ కమిషన్ ని తీవ్రంగా వ్యతిరేకించి కుల రాజకీయం వద్దు అని చెప్పిన రాజీవ్ గాంధీ బాటన కాంగ్రెస్ ఎందుకు నడవడం లేదు అని బీజేపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

అదే టైంలో రాహుల్ గాంధీ తన తండ్రి చెప్పిన మాటలను విని ఆయన బాటను అనుసరిస్తున్నారా అన్నది మరో చర్చగా ఉంది. ఇక న్యూట్రల్ వాదంగా చెప్పుకోవాలీ అంటే అందరికీ అతి పెద్ద కులం ఒకటి ఉంది అదే పేదరికం. దాన్ని రూపుమాపే చర్యలకు దిగాలి కానీ కుల విభజన పేరుతో ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా చిచ్చు రేపుతూ ముందుకు పోతే రేపటి రోజున కులాలను అడ్డం పెట్టుకుని విభజనలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందేవారూ ఉన్నారు.