ఆ తప్పుడు సలహా రాజీవ్ ప్రాణం తీసిందా ?
రాజీవ్ గాంధీ హత్య కావించబడిన రోజు 1991 మే 21. మే 20 అర్ధరాత్రి ఆయన విశాఖ గడ్డ మీదనే ఉన్నారు.
By: Satya P | 22 May 2026 8:00 AM ISTరాజీవ్ గాంధీ హత్య కావించబడిన రోజు 1991 మే 21. మే 20 అర్ధరాత్రి ఆయన విశాఖ గడ్డ మీదనే ఉన్నారు. విశాఖలో ఆయన కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధి ఉమా గజపతిరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన తమిళనాడు పర్యటన పెట్టుకున్నారు. అప్పట్లో డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటు అయిన చంద్రశేఖర్ ప్రభుత్వం రద్దు చేసింది. కరుణానిధి నేతృత్వంలోని ప్రభుత్వానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం మధ్య సంబంధాలు ఉన్నాయన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
ఎల్టీటీఈ టార్గెట్ గా :
అంతకు ఏణ్ణర్ధం ముందు దాకా కేంద్రంలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా 1987 జూలైలో ఇండో శ్రీలంక శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీటీని నిరాయుధులను చేయడానికి కాల్పుల విరమణను అమలు చేయడానికి భారత శాంతి పరిరక్షక దళాన్ని మోహరించడం ద్వారా శ్రీలంక ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. ఈ ఒప్పందం మేరకు లక్ష వరకు భారత సైనికులను ఉత్తర తూర్పు శ్రీలంకకు పంపారు.
ఒప్పందంతో సవాళ్ళు :
ఎల్‌టిటిఈ తమ ఆయుధాలను పూర్తిగా అప్పగించడానికి నిరాకరించినప్పుడు భారత శాంతి పరిరక్షక దళం ఎల్‌టిటిఈతో నేరుగా పోరాడాల్సి వచ్చింది. ఎల్‌టిటిఈకి బలమైన స్థావరమైన జాఫ్నాను స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ పవన్ వంటి దాడులను భారత శాంతి పరిరక్షక దళం ప్రారంభించింది.ఈ జోక్యం చివరికి భారత సాయుధ దళాలకు అతి పెద్ద చిక్కుముడిగా మారింది. దీని ఫలితంగా 1990లో మిగిలిన దళాలను ఉపసంహరించుకోవడానికి ముందే భారీ ప్రాణ నష్టం జరిగింది. అది కాస్తా 1991 మే 21న జరిగిన ఎల్‌టిటిఈ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడానికి ప్రధాన కారణం అయింది.
రాజీవ్ మీద దాడి యత్నం :
ఇదిలా ఉండగా అంతకు ముందు కూడా రాజీవ్ 1987 జూలై 30న శ్రీలంకలోని కొలంబోలో నావికాదళ గౌరవ గార్డు అయిన విజయిత రోహన డి సిల్వా తన రైఫిల్ బట్‌తో భారత ప్రధాని రాజీవ్ గాంధీ మీద దాడికి యత్నించారు. హత్యాయత్నం నుండి రాజీవ్ గాంధీ తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ దాడి యత్నంలో రాజీవ్ గాంధీకు తలకు కాకుండా ఆయన ఎడమ భుజానికి బలంగా తగిలింది. రాజీవ్ గాంధీ శ్రీలంకకు సహాయం చేయడం పట్ల ఆగ్రహాన్ని అలా చూపించి ఆయనను చంపాలని అనుకున్నట్లు దాడి చేసిన గౌరవ గార్డు తరువాత చెప్పాడు. అలా రాజీవ్ గాంధీ హత్యకు నాలుగేళ్ళకు ముందే ఈ విధంగా హతమార్చే ప్రయత్నం ఒకటి జరిగిందన్నది చరిత్రలో ఉంది.
వేడి అలా ఉండగానే :
ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ 1989 డిసెంబర్ దాకా ప్రధాని హోదాలో ఉన్నారు. ఆయనకు టచ్ చేసేందుకు కూడా ఎవరికీ దేశంలో ఆస్కారం లేదు. అంతటి టైట్ సెక్యూరిటీ ఉంటుంది. 1989 ఎన్నికల ప్రచారాన్ని ఆయన తమిళనాడులో నిర్వహించినా ప్రధాని హోదాలో చేశారు. కానీ ఓటమి తరువాత ఒక్కసారిగా ఆయన మాజీ అయిపోయారు. ఇక ఏణ్ణర్థం తేడాలో ఎన్నికలు రావడం ఆ వేడి అలాగే ఉండడం వల్ల కూడా రాజీవ్ గాంధీ హత్య జరిగిందని చెబుతారు.
ప్రభుత్వాన్ని కూలగొట్టి :
అసలు వ్యవహారం ఇక్కడే ఉంది అని అంటున్నారు. రాజీవ్ గాంధీ ఓడిన తరువాత నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. ఉప ప్రధానిగా దేవీలాల్ అయ్యారు. అయితే అనేక పార్టీల కూటమిగా ఈ ప్రభుత్వం దిన దిన గండంగా ఉంది. అయినా సరే కాంగ్రెస్ జోక్యం లేకపోతే ఆ ప్రభుత్వం నుంచి ఏ పార్టీ బయటకు వచ్చేది లేదు. మరింత కాలం కొనసాగేది. కానీ 1979లో జనతా ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూలదోసి అధికారంలోకి వచ్చిన వ్యూహాన్ని ఇక్కడ కూడా కాంగ్రెస్ అమలు చేసింది. అయితే ఇందిరాగాంధీ మూడేళ్ల వరకైనా జనతా ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఇక్కడ అలా జరగలేదు. దాంతో పాటు ఏణ్ణర్ధానికే ప్రభుత్వాన్ని కూలదోయడం అన్నది పెద్ద తప్పుగానే చెబుతారు.
నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కొనసాగి ఉంటే :
ఇక వీపీ సింగ్ సర్కార్ ని కూల్చి తన ఎంపీ సీటు తప్ప వేరే ఎవరి మద్దతు లేని చంద్రశేఖర్ ని తెచ్చి 1990 నవంబర్ నెలలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆ ప్రభుత్వాన్ని ఆరు నెలలు కాకుండా దించేశారు. ఇలాంటి వ్యూహాలు అన్నీ అధికారం మోజులో పడిన కొందరు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ కి తప్పుడు సలహాలుగా ఇచ్చారు అని విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద మరిన్నాళ్ళు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కొనసాగి ఉంటే రాజీవ్ గాంధీ బతికి ఉండేవారు అన్న మాట కూడా ఉంది. ఇక ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం శ్రీలంక దేశాన్ని విడిచి వెళ్ళమని శాంతి పరిరక్షక బలగాలను ఆదేశించిన తర్వాత అవి 1990 మార్చి 24 దేశానికి వచ్చాయి. ఆ వేడి కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టేది అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి చూస్తే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని తొందరగా కూల్చేసి అధికారం చేపట్టాలని రాజీవ్ కి తప్పుడు సలహా ఇచ్చిన కాంగ్రెస్ పెద్దల పుణ్యమాని యువ నాయకుడు ఎంతో భవిష్యత్తు ఉన్న రాజీవ్ ఈ లోకాన్ని వీడాల్సి వచ్చింది అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
