రజనీకాంత్ రాష్ట్రపతి కాబోతున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘క్రేజీ గాసిప్’!
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏ వార్త హాట్ టాపిక్‌గా మారుతుందో చెప్పడం కష్టం. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ చుట్టూ సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ప్రచారం ఊపందుకుంది.
By: Tupaki Political Desk | 24 May 2026 1:00 AM ISTతమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏ వార్త హాట్ టాపిక్‌గా మారుతుందో చెప్పడం కష్టం. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ చుట్టూ సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ప్రచారం ఊపందుకుంది. ఆయన త్వరలోనే దేశ అత్యున్నత పదవి అయిన 'రాష్ట్రపతి' రేసులోకి రాబోతున్నారంటూ కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, దళపతి విజయ్ విజయం తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో... బీజేపీ పెద్దలు రజనీకాంత్‌ను సంప్రదించారని, ఈ క్రమంలోనే రాష్ట్రపతి పదవి ప్రస్తావన వచ్చిందని ఈ వైరల్ కథనాల సారాంశం. అయితే, రాజకీయ విశ్లేషకులు, అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక 'క్రేజీ గాసిప్' మాత్రమేనంటూ వివరిస్తున్నారు.
ఆ వదంతుల్లో నిజమే లేదా?
ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ కాలం వచ్చే ఏడాది జూలైతో ముగియనుంది. ఈ లోపే రజనీకాంత్ సన్నిహితులు ఈ విధమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని కొందరు అల్లుతున్న కథనాలకు ఎక్కడా అధికారిక ప్రాతిపదిక లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకునే రజనీకాంత్, ఇలాంటి పెద్ద పదవుల కోసం వ్యూహాలు రచిస్తున్నారనడం కేవలం ఊహజనితమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రచారంపై అటు రజనీకాంత్ టీమ్ గానీ, ఇటు బీజేపీ అధిష్టానం గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు, చేసే అవకాశం కూడా లేదని అంటున్నారు.
రాజకీయాలపై రజనీకాంత్ స్టాండ్ ఇదే..
గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ దశాబ్దాల పాటు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘రాజకీయాల్లోకి రావడం ఖాయం, పార్టీ పెట్టడం ఖాయం’ అని ఆయనే స్వయంగా ప్రకటించినప్పటికీ... ఆ తర్వాత తన ఆరోగ్యం, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. "నేను రాజకీయాల్లోకి రావడం లేదు. భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు" అని రజనీకాంత్ గతంలోనే అత్యంత స్పష్టంగా ప్రకటించారు. ఇక ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్‌ను రజనీకాంత్ కలవడంపై కూడా రకరకాల పుకార్లు వచ్చాయి. దీనిపై తలైవా వెంటనే స్పందిస్తూ... అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని, దానికి ఎలాంటి రాజకీయ రంగులు పూయవద్దని క్లారిటీ ఇచ్చారు.
కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే..
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలు, రాజకీయాల కలయికకు తమిళనాడు కేరాఫ్ అడ్రస్. అందుకే అక్కడ చిన్న కదలిక వచ్చినా పెద్ద ఎత్తున కథనాలు, ఊహాగానాలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం సక్సెస్ కావడంతో, రజనీకాంత్ పేరును మళ్లీ తెరపైకి తెచ్చి కొందరు నెటిజన్లు ఇలాంటి పోస్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
లైకులు, షేర్ల కోసం సాగుతున్న ఈ డిజిటల్ ప్రచారంలో నిజం ఎంత అని వెతికితే... 'సున్నా' అనే సమాధానమే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తన పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టారని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, ఈ 'రాష్ట్రపతి' ముచ్చట కేవలం ఇంటర్నెట్ లో కాసేపు సరదాగా మాట్లాడుకునే గాసిప్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు.
