విడదల రజని...మీకు వెన్నుపోటు సూట్ కాలేదు !
ఇక విడదల రజనీ చిలకలూరిపేట నుంచి 2019 లో పోటీ చేసి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆమె మంత్రి కూడ అయ్యారు.
By: Satya P | 3 May 2026 5:05 PM ISTవైసీపీకి చెందిన మాజీ మంత్రి, మహిళా నాయకురాలు తాజాగా టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినాయకత్వం వైసీపీని పదే పదే గొడ్డలి పార్టీ అని పిలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీని వెన్నుపోటు పార్టీగా పిలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద సోషల్ మీడియాలో అయితే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంతకీ విడదల రజనీ చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీకి వచ్చిన లాభం ఏమిటి టీడీపీకి వచ్చిన నష్టం ఏమిటి అన్నది కూడా చర్చిస్తున్నారు.
ప్రెస్ మీట్ పెట్టి మరీ :
ఇక విడదల రజనీ లేటెస్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆమె టీడీపీ మీద ఫైర్ అయ్యారు. ఏపీలో వెన్నుపోటు అంటే గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబుదే అన్నారు. కేరాఫ్ అడ్రస్ గా మీరు ఉన్నారని విమర్శించారు. అందువల్ల గొడ్డలి పార్టీ అని వైసీపీని విమర్శిస్తే ఊరుకునేది లేదని టీడీపీని వెన్నుపోటు పార్టీ అని గట్టిగా అంటామని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీని మీదనే రాజకీయంగా పలు విధాలుగా చర్చ సాగుతోంది.
వేరే వాళ్ళు అంటే కనుక :
టీడీపీని చంద్రబాబుని విడదల రజనీ వెన్నుపోటు అని విమర్శించడం మీద పసుపు పార్టీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు దీని మీద తమ ఒపీనియన్స్ చెబుతున్నారు. వైసీపీలో వేరే ఎవరైనా నాయకులు వెన్నుపోటు అని విమర్శించినా మాట్లాడినా ఒక అర్థం ఉంటుందని కానీ రజనీ లాంటి వారు అంటేనే కాస్తా ఆలోచించాలని అంటున్నారు. ఎందుకంటే ఆమెకు వెన్నుపోటు అన్న పదం అసలు సూట్ కాదని అనేస్తున్నారు. ఆమె మొదట ఏ పార్టీలో ఉన్నారు అన్నది గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ఆమె రాజకీయ అరంగేట్రం చేసింది టీడీపీ అని గుర్తు చేస్తున్నారు. ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి కదా ఆమె వైసీపీలో చేరారు అని సెటైర్లు వేస్తున్నారు.
వైసీపీని ఘాటుగా :
రజనీ టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబుని విజనరీ అని మాట్లాడారని అది బహిరంగ వేదికల మీదనే అని అంటున్నారు. అంతే కాదు జగన్ ని వైసీపీని ఆమె ఏ రకంగా తూలనాడారో ఎన్ని విధాలుగా పరుషంగా మాట్లాడారో అందరికీ తెలుసు అని అంటున్నారు. అలా టీడీపీ ద్వారా రాజకీయ ఆశ్రయం పొంది ఆమె 2019లో వైసీపీలో చేరి టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయ్యారు. మరి ఆనాడు టీడీపీకి ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచింది ఆమె కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు బాబుని కీర్తించి ఇపుడు వెన్నుపోటు అనడంలో రాజకీయం తప్ప మరేముందని అంటున్నారు.
ఆయారాం గయారాం :
రాజకీయాల్లో పార్టీలను నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేసేవారు ఉన్నారని అయితే కొందరు మాత్రం అయారాం గయారాం మదిరిగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ చేసి ఆ తరువాత ఏ గూటి పాట అక్కడ పాడుతారని అంటున్నారు. అలాంటి మాటలకు విలువ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ విషయమే తీసుకుంటే టీడీపీని విమర్శించాలి అనుకుంటే వెన్నుపోటు అని కామెంట్స్ చేయించాలి అనుకుంటే వేరే ఎవరైనా అయితే బాగుంటుందని సూచిస్తున్నారు. జంప్ జిలానీల చేత మాట్లాడిస్తే ఆ విమర్శలు తిరిగి వైసీపీకే బూమరాంగ్ అవుతుంది కూడా అంటున్నారు.
పేటలో కూడా అంతే :
ఇక విడదల రజనీ చిలకలూరిపేట నుంచి 2019 లో పోటీ చేసి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆమె మంత్రి కూడ అయ్యారు. అయితే అప్పటికే వైసీపీలో ఉన్న నాయకులు ఆమె మార్క్ రాజకీయం వల్ల ఏ విధంగా అయిపోయారు తరువాత వారు పార్టీని ఏ విధంగా వీడిపోయారు అన్నది కూడా ఆమె గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది అని ప్రత్యర్ధులు కామెంట్స్ చేస్తున్నారు. వెన్నుపోటు అంటే అది కదా అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఈ రోజున వైసీపీలో ఆమె ఉంటూ టీడీపీని విమర్శిస్తున్నారని అదే ఆమె అంతకు ముందు జగన్ ని విమర్శించారని రేపు ఎవరిని విమర్శిస్తారో కూడా చూడాలి కదా అని అంటున్నారు అంటే రజనీ రాజకీయం నిలకడగా లేదని ఆమెని వైసీపీ నమ్ముకుని ఈ పెద్ద మాటలు మాట్లాడిస్తే చివరాఖరికి చింతించాల్సి వస్తుందని అంటున్నారు.
