Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... ఎలక్టోరల్ బాండ్స్ అంతా కిరికిరినా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 March 2024 5:12 AM GMT
వైరల్ ఇష్యూ... ఎలక్టోరల్ బాండ్స్ అంతా కిరికిరినా?
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన విరాళాలు వెళ్లడించడం, వాటిని ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయడంతో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో క్విడ్ ప్రోకో రూపం మార్చుకుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

అవును.. ఎలక్టోరల్ బాండ్లు అనేవి పార్టీలకు అతీతంగా క్విడ్ ప్రోకోకి మరో రూపం అని.. లంచాలకు అందమైన పేర్లని.. రకరకాల విమర్శలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో... వాటికి బలం చేకూర్చుతూ అన్నట్లుగా సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. పైగా ఈ విషయంపై సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యేలోపు సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇవ్వాలనే మాటలు కూడా మేధావి వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి!

ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కాంట్రక్టులు తీసుకున్నందుకు పార్టీలకు అతీతంగా ఇతర పార్టీల నేతలు సైతం, బద్ద శత్రువుల పార్టీలకు కూడా నిధులు సమకూర్చిన అరుదైన సంఘటనలను ఈ ఎలక్టోరల్ బాండ్లు చూపించాయని చెబుతున్నారు. ఈ సమయంలో రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాంని, ఎలక్టోరల్ బాండ్లకు లింక్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలను లింక్ చేస్తున్నట్లు అన్నట్లుగా రాజ్ దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... ఎలక్టోరల్ బాండ్స్ కు, ఢీలీ సీఎం తాజాగా అరెస్ట్ అవ్వడానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు మధ్య ఆసక్తికరమైన లింక్ ఉందని మొదలుపెట్టారు.

దీనికి వివరణ ఇస్తూ... "హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ శరత్ రెడ్డిని ఢిల్లీ ఎక్సైజ్ కేసులో నవంబర్ 11 - 2022న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అలా ఆయన అరెస్ట్ అయిన నాలుగు రోజుల తర్వాత.. అతను డైరెక్టర్ గా ఉన్న అతని తండ్రి స్థాపించిన అరబిందో ఫార్మా కంపెనీ... ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.5 కోట్లు చెల్లించింది" అని ట్వీట్ కంటిన్యూ చేశారు.

అనంతరం... "ఈ క్రమంలో మే 2023, శరత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఈడీ దానిని అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జూన్ 2 - 2023న అప్రూవర్ గా మారారు. ఈ నేపథ్యంలో నవంబర్ 8 - 2023న అరబిందో ఫార్మా బాండ్ల ద్వారా మరో రూ.25 కోట్లు బీజేపీ విరాళంగా ఇచ్చింది" అని తెలిపారు.

దీంతో... ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకీ, ఎలక్టోరల్ బాండ్స్ కి.. వీటి మధ్యలో బీజేపీకి ఇంత అవినాభావ సంబంధం ఉందా అనే విషయం తెరపైకి వచ్చింది! ఈ విషయంపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!