Begin typing your search above and press return to search.

భర్త కాంగ్రెస్ - భార్య జేజేపీ... ఒకే నియోజకవర్గంలో పోటీ!

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్‌ లోని దాంతా రాంగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వీరేంద్ర సింగ్‌ ఉన్నారు

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:28 AM GMT
భర్త కాంగ్రెస్ - భార్య జేజేపీ... ఒకే నియోజకవర్గంలో పోటీ!
X

శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లోనే చీరలు కట్టుకుని, జడలు వేసుకుని వివిధ రూపాల్లో ఉంటారు అని ఒక డైలాగ్! యుద్ధంలో శత్రువుని చంపాక నిద్రపోతాం.. కానీ, ఇంట్లో మాత్రం శత్రువుతోనే కలిసి పడుకుంటాం.. భార్య గురించి ఒక భర్త చెప్పే మరో డైలాగ్! ఆ డైలాగుల సంగతి అలా ఉంటే... త్వరలో జరగబోయే ఎన్నికల్లో తన భర్తపై పోటీకి సిద్ధపడుతోంది ఒక మహిళ! ఇప్పుడు స్థానికంగా ఇదే హాట్ టాపిక్!

అవును... ఒకే ఇంట్లో కలిసి ఉంటూన్న భార్యాభర్తలు రాజకీయాల్లోకి వచ్చేసరికి ప్రత్యర్థులుగా మారబోతున్నారు. ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉంటూ ఒకే నియోజకవర్గంలో పోటీకి దిగబోతున్నారు. దీంతో ఇప్పుడు ఇది ఆ రెండు పార్టీల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశం అయ్యింది. వీరిలో భర్త కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. భార్య జేజేపీ నుంచి రంగంలోకి దిగబోతున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్‌ లోని దాంతా రాంగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వీరేంద్ర సింగ్‌ ఉన్నారు. ఈఅయన పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నారాయణ్‌ సింగ్‌ కుమారుడు. సో.. వీరిది కాంగ్రెస్ పార్టీ అన్నమాట! ప్రస్తుతం దాంతా రాంగఢ్ నియోజకవర్గంలో ఆయనే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం అని చెబుతున్నారు.

ఈయన భార్య పేరు రీటా చౌధరి. ఈమె 2018లో కాంగ్రెస్‌ తరఫున దాంతా రాంగఢ్ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఆ ఎదురుదెబ్బతో రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎదగడంపై మరింత దృష్టిపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)లో చేరారు. అనతికాలంలోనే ఆ పార్టీలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలయిపోయారు. అంటే... భర్త కాంగ్రెస్ లో ఉంటే.. భార్య జేజేపీలో మంచి పొజిషన్ లో ఉన్నారన్నమాట!

ఈ నేపథ్యంలో... దాంతా రాంగఢ్‌ లో తమ అభ్యర్థిగా రీటాను ప్రకటించింది జేజేపీ. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె... అభివృద్ధి, నీటి సమస్యలు, నిరుద్యోగిత వంటి సమస్యలనే ఎన్నికల ప్రచారంలో నా అస్త్రాలుగా చేసుకూటున్నట్లు తెలిపారు. ఇప్పుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు బాగానే పనిచేశారని సన్నాయినొక్కులు నొక్కుతూ... చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన భర్తకు సీటు కన్ ఫాం విషయంపై ప్రశ్నిస్తే... కాంగ్రెస్‌ ఆయనకు ఇంకా టికెట్‌ ఖరారు చేయలేదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడబోనని చెబుతున్నారు. అయితే వీరేంద్ర సింగ్ కి టిక్కెట్ కన్ ఫాం అని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. దీంతో... ఈ ఎన్నికల్లో తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు తప్పకుండా ఉంటుందని వీరేంద్ర సింగ్ చెబుతుండటం గమనార్హం!

కాగా... ఒకే ఇంట్లో తండ్రీ కొడుకులు వేరు వేరు పార్టీల్లో ఉండటం, అన్నదమ్ములు ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉండటం చాలానే చూశాం కానీ... మరీ ఇలా భార్యాభర్తలు ఇలా ఈ రోజుల్లో వేరు వేరు పార్టీల్లో తలబడటానికి సిద్ధపడటం మాత్రం రొటీన్ కి భిన్నం అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు!