పెళ్లి పత్రికల్లో 'డేట్ ఆఫ్ బర్త్' తప్పనిసరి ప్రభుత్వం కఠిన నిర్ణయం.. స్వాగతిస్తున్న నెటిజన్లు..
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ (ఆఖా తీజ్) రోజున అబూజ్ ముహూర్తాలు (అత్యంత శుభప్రదమైనవి) ఉంటాయని నమ్ముతారు. ఆ ఒక్క రోజే వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి.
By: Tupaki Political Desk | 11 April 2026 1:18 PM ISTరాజస్థాన్ అంటేనే మనకు రంగురంగుల సంస్కృతితో పాటు దురదృష్టవశాత్తూ ‘బాల్య వివాహాలు’ కూడా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా అక్షయ తృతీయ, రావి పౌర్ణిమ వంటి సామూహిక ముహూర్తాల రోజున వందలాది మంది చిన్నారులకు తెలియకుండానే పెళ్లిళ్లు జరిగిపోతుంటాయి. ఈ సామాజిక రుగ్మతను వేర్లతో సహా తొలగించడానికి రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ ‘వెడ్డింగ్ కార్డ్’ నిర్ణయం వినడానికి వింతగా ఉన్నా, ఆచరణలో మాత్రం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు.
పెళ్లి పత్రికలో డేట్ ఆఫ్ బర్త్!
చట్టాలు ఎన్ని ఉన్నా లూప్‌హోల్స్ వెతికే వారికి రాజస్థాన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై రాజస్థాన్‌లో పెళ్లి పత్రిక అంటే కేవలం ముహూర్తం, విందు వివరాలు మాత్రమే కాదు.. వధూవరుల ‘వయసు ఎంత’ అనేదానికి అది ఒక అధికారిక సాక్ష్యంగా మారబోతోంది. అక్షయ తృతీయ, రావి పౌర్ణిమ రోజుల్లో జరిగే వేలాది వివాహాలను పర్యవేక్షించడం అధికారులకు కష్టంగా మారుతున్న నేపథ్యంలో, ఈ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
బాల్య వివాహాలు ఎక్కువగా రహస్యంగా లేదా సామూహికంగా జరుగుతుంటాయి. పెళ్లి పత్రికలో వధూవరుల డేట్ ఆఫ్ బర్త్ ముద్రించడం తప్పనిసరి చేయడం ద్వారా, ఆ వివాహం చట్టబద్ధమైనదో కాదో గ్రామస్తులు, అధికారులు సులభంగా గుర్తించవచ్చు. ఒకవేళ పత్రికలో తప్పుడు వివరాలు ముద్రిస్తే, అది ఫోర్జరీ కేసు కిందకు వస్తుంది. అలాగే వయసు నమోదు చేయకుండా పత్రికలు ముద్రిస్తే సదరు ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం కూడా చిక్కుల్లో పడుతుంది.
అందరూ బాధ్యులే..
ఈ నిర్ణయంలోని అత్యంత కఠినమైన భాగం ఇదే. బాల్య వివాహం జరిగితే కేవలం తల్లిదండ్రులనే కాదు.., ఆ పెళ్లికి సహకరించిన ప్రతి ఒక్కరినీ నిందితులుగా కేసులో నమోదు చేయబోతున్నారు.
పెళ్లి జరిపించే పంతులు వయసు ధృవీకరణ పత్రాలు చూడకుండా ముహూర్తం పెడితే కటకటాల పాలవాల్సిందే. ఇక బ్యాండ్ మేళం.., వంటవారు, టెంట్ హౌస్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు.. వీరంతా పెళ్లికి ముందే వధూవరుల వయసు నిర్ధారించుకోవాలి. లేదంటే PCMA-2006 (Prohibition of Child Marriage Act) చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేస్తారు.
ఆ రెండు రోజుల్లోనే టార్గెట్ ఎందుకు?
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ (ఆఖా తీజ్) రోజున అబూజ్ ముహూర్తాలు (అత్యంత శుభప్రదమైనవి) ఉంటాయని నమ్ముతారు. ఆ ఒక్క రోజే వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. ఇందులో చాలా వరకు బాల్య వివాహాలే ఉంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ రెండు ప్రత్యేక రోజుల్లో వివాహం చేసుకునే వారు ఖచ్చితంగా పెళ్లి పత్రికలో డేట్ ఆఫ్ బర్త్ ముద్రించాలనే నిబంధనను ప్రభుత్వం కఠినతరం చేసింది.
నెటిజన్ల ప్రశంసలు
ఈ వినూత్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఒక చిన్న మార్పు పెద్ద సామాజిక మార్పుకు దారితీస్తుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విద్యావంతులైన వారు కూడా దీనిని సమర్థిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో చిన్నారుల మెడలో తాళి కట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుందని, ఇలాంటి కఠిన నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కోరుతున్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం బాల్య వివాహాలను అరికట్టడంలో మైలురాయిగా నిలవబోతోంది. భయం ఉన్న చోటే భక్తి ఉంటుంది అన్నట్లుగా.. కఠినమైన శిక్షలు ఉంటేనే ఇలాంటి అనాచారాలు ఆగిపోతాయి. పెళ్లి పత్రికలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయడం అనేది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదు.. అది ఒక చిన్నారి బాల్యాన్ని కాపాడే ఆయుధం.
