హనీమూన్ మర్డర్ 2.0 ఇది... పక్కాగా ప్లాన్ చేసింది!
ఈ కేసులోనూ ప్రియుడితో కలిసి తన భర్తను భార్యే హత్య చేయించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే పనికి పూనుకున్నారు. అయితే దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
By: Raja Ch | 5 Feb 2026 3:24 PM ISTగత ఏడాది మే నెలలో మేఘాలయలో సోనమ్ రఘువంశీ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ లో హత్యచేయించిన సంగతి తెలిసిందే. జలపాతం సమీపంలో భర్తను ప్రియుడితో కలిసి ఆమె హత్య చేయించింది! ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ లోనూ ఇదే తరహా ఘటన తెరపైకి వచ్చింది. ఈ కేసులోనూ ప్రియుడితో కలిసి తన భర్తను భార్యే హత్య చేయించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే పనికి పూనుకున్నారు. అయితే దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
అవును.... జనవరి 30న రాజస్థాన్ కు చెందిన ఆశిష్, అంజు అనే నూతన దంపతులు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వాహనం వారిని ఢీకొట్టడంతో.. ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అంజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే తొలుత అంతా దీన్ని హిట్ అండ్ రన్ కేసుగానే భావించగా.. తాజాగా ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... ప్రియుడితో కలిసి అంజూ.. ఆశిష్ ను పక్కా ప్లాన్ తో చంపించిందని పోలీసులు గుర్తించారు. దీంతో.. ఇది హనీమూన్ మర్డర్ 2.0గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... జనవరి 30 రాత్రి 9 గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్ పోలీసు స్టేషన్ కు ఓ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందింది. ఇందులో భాగంగా... ఓ జంట రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారని తెలిసింది. దీంతో వెంటనే ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు.. వారిని కమ్యునిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆశిష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సమయంలో పోలీసులు అంజూని విచారించారు.
ఈ సందర్భంగా స్పందించిన అంజూ.. ఎవరో తమను వాహనంతో ఢీకొట్టి వెళ్లిపోయారని తెలిపారు. ఇదే సమయంలో తన బంగారు ఆభరణాలు దోచుకున్నారని ఆమె పేర్కొంది. అయితే దర్యాప్తులో.. అంజూ చెప్పిన మాటలకు, వాసతవ పరిస్థితులకు వ్యత్యాసాన్ని గుర్తించారు పోలీసులు. ఇదే సమయంలో ఆశిష్ ను గొంతు కోసి హత్య చేసినట్లు వైద్య నివేదికలో వెల్లడైన పరిస్థితి. మరోవైపు అంజూకు ఎలాంటి గాయాలు కాకపోవడం కూడా పోలీసులకు సందేహాలు కలిగించిందని చెబుతున్నారు.
మరోవైపు.. ఆమె ఫోన్ ను పరిశీలించిన పోలీసులు.. ఆమె తన ఇంటికి సమీపంలోని సంజు అనే వ్యక్తితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. దీంతో.. అంజు సూచనల మేరకు సంజు, మరో ఇద్దరు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. వీరు అతనిపై దాడి చేసి, గొంతు కోసి, ఆపై దానికి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా... అంజు, ఆశిష్ లకు మూడు నెలల క్రితమే వివాహం అవ్వగా.. అసంతృప్తితో ఉన్న అంజు తన స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయిందని అంటున్నారు. అక్కడ ఆమె తన మాజీ ప్రియుడు సంజూతో కలిసి.. ఆశిష్ హత్యకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
