Begin typing your search above and press return to search.

పాక్ తో 1,037 కి.మీ. సరిహద్దు.. రాజస్థాన్ లో ఏమి జరుగుందంటే..?

ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ - పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ అవుతోంది!

By:  Tupaki Desk   |   8 May 2025 12:55 PM IST
High Alert in Rajasthan After Retaliatory Strikes on Terror Camps Across LoC
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా... పాకిస్థాన్, పీవోకే లలో 9 ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 80 మంది వరకూ ఉగ్రవాదులు మరణించారు! ఈ సమయంలో పాక్ – భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో బోర్డర్ రాష్ట్రం రాజస్థాన్ లో కీలక పరిణామలు నెలకొన్నాయి.

అవును... ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ - పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ అవుతోంది! ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ నుంచి భారత్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉందనే చర్చ నేపథ్యంలో... స్థానిక ఆధికారులు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానంగా పాకిస్థాన్ తో సుమారు 1,037 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్ లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నామని చెప్పిన అధికారులు... ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనిపిస్తే వెంటనే కాల్పులు జరపాలని భద్రతా దళ సిబ్బందికి అదేశాలు జారీ చేశారు.

ఇదే సమయంలో సరిహద్దుల్లో భారత వైమానిక దళం అప్రమత్తగా ఉండి.. యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి. దీంతో... కిషన్ గఢ్, జోధ్ పూర్, బికనీర్ ఎయిర్ పోర్టుల నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఇదే సమయంలో... గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకూ సుఖోయ్-30 ఎంకేఐ జెట్ లు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి.

ఈ సమయంలో రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో స్కూల్స్ మూసివేశారు.. పరీక్షలు ఆపేశారు. అదే విధంగా సెలవుల్లో ఉన్న పోలీసులు, రైల్వే సిబ్బంది తక్షణ విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాలికలు రచించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో జైసల్మేర్, జోధ్ పూర్ లకు అర్ధరాత్రి నుంచి ఉదయం 4 గంటల వరకూ బ్లాక్ అవుట్ కోసం ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.