Begin typing your search above and press return to search.

ప్రమాణస్వీకారం చేయనంతే.. రాజాసింగ్ సంచలనం

పరిచయం చేయాల్సిన తెలంగాణ రాజకీయ నేతల్లో ఒకరు రాజాసింగ్. బీజేపీలో ఉన్నా లేకున్నా ఆయన తీరు.. వ్యవహారశైలి ఒకేలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 3:55 AM GMT
ప్రమాణస్వీకారం చేయనంతే.. రాజాసింగ్ సంచలనం
X

పరిచయం చేయాల్సిన తెలంగాణ రాజకీయ నేతల్లో ఒకరు రాజాసింగ్. బీజేపీలో ఉన్నా లేకున్నా ఆయన తీరు.. వ్యవహారశైలి ఒకేలా ఉంటుంది. హిందుత్వవాదినన్న మాటను ఓపెన్ గా చెప్పేసే ఆయన.. మజ్లిస్ పార్టీతో నిత్యం తగువులాడుతుంటారు. హిందుత్వ వాదాన్ని వినిపించే క్రమంలో సంచలన వ్యాఖ్యలతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి వెనుకాడని తత్వం ఆయన సొంతం.

ఇటీవల వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గోషామహాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజాసింగ్.. విజయం సాధించటం తెలిసిందే. శనివారం నుంచి ప్రారంభం కానున్న కొత్త అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలంతా పదవీ ప్రమాణస్వీకారాన్ని చేపట్టాల్సి ఉంది. అయితే.. ఇందుకు ససేమిరా అంటున్నారు. దీనికి కారణం ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయటమే కారణంగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువు తీరుతున్న మూడో శాసన సభకు స్పీకర్ ఎవరూ లేని నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ ను ఏర్పాటు చేసి.. ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇందుకు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు రాజాసింగ్. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని తేల్చేశారు.

‘‘ అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే.. నేను ప్రమాణం చేయను. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణస్వీకారం చేయరు. అక్బరుద్దీన్ కు ప్రొటెం స్పీకర్ గా ఎందుకు అవకాశం ఇచ్చారు? ఆయన కంటే అసెంబ్లీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వారికి ఎందుకు ఇవ్వరు? గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది. గతంలో అక్బరుద్దీన్ హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ప్రమాణం చేయిస్తానంటే నేను ప్రమాణం చేయను’’అని తేల్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.