రాజంపేట పేట రాజకీయం వేడెక్కించేశారే... !
ప్రతి నియోజకవర్గానికీ ఒక హిస్టరీ ఉంటుంది. అలానే.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటకు కూడా అలాంటి హిస్టరీనే ఉంది.
By: Tupaki Desk | 10 July 2025 4:41 PM ISTప్రతి నియోజకవర్గానికీ ఒక హిస్టరీ ఉంటుంది. అలానే.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటకు కూడా అలాంటి హిస్టరీనే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం దక్కించుకుంది. ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాల సుబ్రహ్మణ్యం ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు.. గత ఎన్నికల్లో షఫిలింగ్‌కు గురైన మేడా మల్లికార్జున రెడ్డి కూడా.. వైసీపీలోనే కొనసాగుతున్నారు.
అంటే.. ఒకరకంగా రాజంపేటలో వైసీపీకి బలం పెరిగిందనే అనుకోవాలి. టీడీపీ నుంచి జంపింగులు సాగడం.. వైసీపీలోనూ నాయకులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గంలో రాజకీయా లు సహజంగానే వేడి వేడిగా సాగాలి. సర్కారును కార్నర్ చేసేలా నాయకులు స్పందించాలి. కానీ.. అదేం చిత్రమో కానీ.. గత ఏడాది కాలంలో ఎలా ఉన్నా.. గత రెండు మాసాలుగా మాత్రం ఇక్కడి రాజకీయాలు స్తబ్దుగా మారాయి. అంతేకాదు.. సుగవాసి సోదరుడు.. ఇప్పుడు కీలక నాయకుడిగా మారారు.
టీడీపీ జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న సుగవాసి సోదరుడు ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్‌రెడ్డికి.. ఆయనకు మధ్య పొసగడం లేదన్న కబుర్లు వినిపిస్తున్నాయి. గత నెలలో పెద్ద వివాదమే తలెత్తింది. అయితే.. కీలక నాయకుడిగా ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యం బయటకు వచ్చాక.. మార్పులు జరుగుతాయని అనుకున్నా.. ఇప్పటి వరకు నియోజకవర్గం ఇంచార్జ్‌ని నియమించలేదు. ఈ సీటు కోసం.. సుగవాసి సోదరుడు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ. బీసీ జనార్దన్‌రెడ్డి మాత్రం తన వారితో భర్తీ చేయాలని చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. వైసీపీలో కీలక నాయకులు ఉండడం కూడా కలసి రావడం లేదు. ఎవరూ కూడా దూకుడుగా రాజకీయాలు చేయలేక పోతున్నారు. ఎవరు ప్రజల్లోకి వెళ్తే.. ఏం జరుగుతుందో అనే బెంగతోపాటు.. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్లినా ఎన్నికలనాటికి టికెట్ విషయంపై కసరత్తు చేపడితే.. అప్పుడు తమ పేరు ఉంటుందో ఉండదోనన్న ఆవేదన కూడా నాయకుల్లో కనిపిస్తోంది. సో.. ఇలా రాజంపేట రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలు కూడా అంతర్గత ఇబ్బందులు పడుతున్న విషయం గమనార్హం.
