Begin typing your search above and press return to search.

మళ్లీ ఏసేశాడుగా? గులాబీ బాస్ కు రాజయ్య టెన్షన్!

గులాబీ ఎమ్మెల్యేల్లో కొందరు మాత్రం తరచూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ కోవలో అందరి కంటే ముందుంటారు స్టేషన్ ఘన్ పూర్ గులాబీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

By:  Tupaki Desk   |   10 Oct 2023 6:15 AM GMT
మళ్లీ ఏసేశాడుగా? గులాబీ బాస్ కు రాజయ్య టెన్షన్!
X

గులాబీ ఎమ్మెల్యేల్లో కొందరు మాత్రం తరచూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ కోవలో అందరి కంటే ముందుంటారు స్టేషన్ ఘన్ పూర్ గులాబీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కేసీఆర్ సర్కారు 1లో ఉప ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆయనపై అనూహ్య రీతిలో వేటు పడటం.. దీనిపై ఆయన గుర్రుగా ఉండటం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు తెర మీదకు వచ్చినప్పటికీ.. ఆయనపై ప్రజాఆగ్రహం తక్కువన్న మాట వినిపిస్తూ ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు గులాబీ బాస్ టికెట్ ఇవ్వకపోవటం తెలిసిందే.

దీంతో.. అలకబూనిన రాజయ్య.. ఎట్టకేలకు ఇటీవల ఆయనకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు. తాజాగా రైతుబంధు సమితి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాజయ్య నోటి నుంచి టికెట్ గురించి మరోసారి స్పందించారు. ఇప్పటికితనకు టికెట్ కేటాయిస్తారన్న ఆశతో తాను ఉన్నట్లుగా చెప్పారు. సాధారణంగా ఏదైనా అంశంపై పట్టుబట్టి.. అలకబూనితే.. అందుకు బుజ్జగించి.. పదవులు కట్టబెట్టటం తెలిసిందే.

రాజయ్యతో పాటు టికెట్లు ఆశించిన కొందరికి పదవుల్ని అప్పగించి బుజ్జగించినట్లుగా గులాబీ బాస్ నిర్ణయాన్ని తీసుకుంటే.. ఇలాంటివేళ.. మరోసారి తెర మీదకు వచ్చిన రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిమానం తనకే ఉందని.. సర్వేలు.. ఇతర నివేదికలు తనకే అనుకూలంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవల్ లో పరిస్థితిని చూసి.. అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా కొనసాగాలని కోరుకుంటున్నారని.. నియోజకవర్గంలో ప్రజాభిఫ్రాయాన్ని అధిష్ఠానం తెలుసుకొని. చివర్లో అయినా టికెట్ తనకే కేటాయిస్తుందన్న నమ్మకం ఉన్నట్లుగా చెప్పారు. ఓవైపు గులాబీ బాస్ అప్పజెప్పిన ఛైర్మన్ గిరి చేపడుతూనే.. టికెట్ మీద తనకున్న ఆశను వ్యక్తం చేసిన తీరు చూస్తే.. రాజయ్య టెన్షన్ గులాబీ బాస్ కు తీరినట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.