Begin typing your search above and press return to search.

రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీకి దెబ్బలు.. జూన్ 25న ఏం జరిగింది?

సెప్టెంబరు 25న భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీసినప్పుడు ఖైదీల మధ్య తోపులాటతో నవీన్ గాయాలపాలయ్యాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:32 AM GMT
రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీకి దెబ్బలు.. జూన్ 25న ఏం జరిగింది?
X

వీవీఐపీలు రిమాండ్ ఖైదీలుగా ఉన్న జైల్లో భద్రత విషయంలోనూ.. అక్కడ చోటు చేసుకునే పరిణామాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఉంటుంది. గత నెల (సెప్టెంబరు) 25న రాజమహేంద్రవరం జైల్లో చోటు చేసుకున్నఒక సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏపీ విపక్ష నేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న జైల్లో చోటు చేసుకన్న తోపులాట బయటకు వచ్చి ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఒకరిపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంతకూ ఆ రోజేం జరిగింది? అసలు గొడవకు కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.

విజయవాడ భవానీపురానికి చెందిన నవీన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడు. సెప్టెంబరు 25న భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీసినప్పుడు ఖైదీల మధ్య తోపులాటతో నవీన్ గాయాలపాలయ్యాడు. అతడ్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది. తోపులాట వేళ.. నవీన్ సిమెంట్ దిమ్మపై పడటంతో అతడి ఎడమ దవడకు తీవ్ర గాయమైనట్లుగా చెబుతున్నారు. దీంతో సర్జరీ కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఈ ఉదంతం ఎక్కడా బయటకు రాకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం. సర్జరీ చేయాల్సినంత గాయం పెద్దదిగా ఉన్నప్పుడు.. పదిహేను రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారన్నది ప్రశ్న. దీనిపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ.. రిమాండ్ ఖైదీగా ఉన్న రాహుల్ సెప్టెంబరు 25న భోజనానికి వెళుతున్నప్పుడు.. కంగారుగా కాలుజారి పక్కనే ఉన్న మెట్లపై పడటంతో అతని ఎడమ దవడకు గాయమైనట్లుగా పేర్కొన్నారు.

జైలు డాక్టర్ల సూచన మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు సెలవులో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండుసార్లు కాకినాడకు నవీన్ ను పంపామని.. మూడో దఫా వైద్యంలో భాగంగా సర్జరీ చేస్తున్నట్లుగా చెప్పటం గమనార్హం.