Begin typing your search above and press return to search.

నేను హోం మంత్రినైతే.. బీఆర్‌ఎస్‌ వాళ్లను కంట్రోల్‌ లో పెడతా!

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 7:02 AM GMT
నేను హోం మంత్రినైతే.. బీఆర్‌ఎస్‌ వాళ్లను కంట్రోల్‌ లో పెడతా!
X

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను హోంమంత్రినయితే బీఆర్‌ఎస్‌ వాళ్లను కంట్రోల్‌ లో పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ నిర్వహించారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తెలిపారు. మంత్రి పదవిపై తనకు కాంగ్రెస్‌ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తనకు హోంశాఖ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.

కేసీఆర్‌ ను గద్దె దించడానికే తాను కాంగ్రెస్‌ లోకి వచ్చానని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తెలిపారు. తాను హోంమంత్రి అయితేనే వాళ్లు (బీఆర్‌ఎస్‌ నేతలు) కంట్రోల్‌ లో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ వాళ్లను జైలుకు పంపాలన్నదే తన కోరికని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీని కేసీఆర్‌ బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు. కేసీఆర్‌ కు బీజేపీనే శ్రీరామ రక్ష అని ఆరోపించారు. కేసీఆర్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను హోంమంత్రి అయితే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్, జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

భువనగిరి, నల్లగొండ లోక్‌ సభ స్థానాల నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నదే తమ ఆలోచన అని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామన్నారు. ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా గెలిపిస్తామని వెల్లడించారు. రాజగోపాలరెడ్డి భార్య భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా తనకు హోం మంత్రి పదవిపై ఆశలు ఉన్నాయని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన ఇష్టాన్ని బయటపెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి, అందులోనూ ఒకే జిల్లా నుంచి మంత్రి పదవులు ఇవ్వడం ఎలా కుదురుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.