తెలంగాణ బీజేపీలో చేరికలు.. రాజాసింగ్ హెచ్చరికలు ఇవే..
బీజేపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన రాజాసింగ్.. కమల దళంలో చేరికలను అడ్డుకునేలా కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 16 Aug 2025 2:00 PM ISTతెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవాలని భావిస్తున్న కమల దళం.. గులాబీ పార్టీలో నెలకున్న గందరగోళాన్ని అవకాశంగా మలుచుకోవాలని వ్యూహం రచిస్తోంది. దీంతో గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఇప్పుడు మాజీలైన నేతలపై ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ నేతలను చేర్చుకున్న బీజేపీ.. ఆ తర్వాత పెద్దగా చేరికలపై దృష్టి పెట్టలేదు. అయితే ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును చేర్చుకుని ఆపరేషన్ ఆకర్ష్ రీస్టార్ట్ అయిందని సంకేతాలు పంపుతోంది. గువ్వల బాలరాజు తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీలోకి వస్తున్న నేతలను ఉద్దేశించి ఆ పార్టీకి చెందిన మాజీ నేత రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కమలం కండువా కప్పుకునేందుకు ఉర్రూతలూగుతున్న నేతలు ముందు కొన్ని కేసు స్టడీలు చేయాలని రాజాసింగ్ సలహా ఇస్తున్నారు.
రాజాసింగ్ స్టాప్ బోర్డు
బీజేపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన రాజాసింగ్.. కమల దళంలో చేరికలను అడ్డుకునేలా కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. వలసలను ప్రోత్సహించి క్షేత్రస్థాయి బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీకి రాజాసింగ్ అడ్డుగా నిలవడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలని అనుకున్న రాజాసింగ్.. తీవ్ర అవమానకరమైన పరిస్థితుల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. నామినేషన్ల ముందు పిలిచి టికెట్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు కూడా తన విషయంలో సానుకూలంగా ఉంటుందని భావించిన రాజాసింగ్ కు పార్టీ అధిష్టానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. పార్టీపై అలిగి రాజీనామా ప్రకటన చేస్తే, పిలిచి చర్చిస్తారని ఆశించిన ఎమ్మెల్యేకి ఎగ్జిట్ బోర్డు చూపించింది హైకమాండ్. అయితే తన విషయంలో బీజేపీ నిర్ణయానికి స్థానికంగా కొందరు నాయకులే కారణమని భావిస్తున్న వారు నాశనమైపోతారని శాపనార్థలు పెడుతున్నారు. అంతేకాకుండా బీజేపీలోకి వద్దామని అనుకునే ఇతర పార్టీల నేతలు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ మాటలు యాదిలో పెట్టుకోండి
ఇంతకీ బీజేపీలోకి వద్దామని భావిస్తున్న నేతలకు రాజాసింగ్ సలహా ఏంటన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ‘‘పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాదిలో పెట్టుకోండి.. మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి’’ అంటూ రాజాసింగ్ చేస్తున్న హెచ్చరికలు నేతలను పునరాలోచనలోకి నెడుతున్నాయని అంటున్నారు. గువ్వల బాలరాజు, అబ్రహం వంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల దారిలో ప్రయాణించాలని భావించిన మరో మాజీ ఎమ్మెల్యే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అంటున్నారు. దీనికి రాజాసింగ్ చేసిన హెచ్చరికలే కారణమన అంటున్నారు. బీజేపీలో చేరాలంటే.. నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో ముందే తెలుసుకోవాలని సూచిస్తున్న రాజాసింగ్.. బీజేపీలో టికెట్ గ్యారెంటీ అనే నమ్మకంతో మాత్రం చేరొద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీలో చేరాక మీరు అనుకున్నది మీ నియోజకవర్గంలో జరగదు అన్న విషయాన్ని గమనించాలని చెబుతున్నారు రాజాసింగ్. మీతో పాటు చేరిన కార్యకర్తలకు మీరు ఏ పదవి ఇప్పించలేరు అని కూడా రాజాసింగ్ హెచ్చరిస్తున్నారు. మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు.. మెల్లగా లాస్ట్ సీట్లోకి తోసేస్తారు అంటూ తన అనుభవాన్ని రంగరించి రాజాసింగ్ చెబుతుండటంతో బీజేపీలోకి రావాలని భావించిన వారు వెనక్కి తగ్గుతున్నారని ప్రచారం జరుగుతోంది.
వారంతా ఎందుకు వెళ్లిపోయారో తెలుసా?
తనతోపాటు కొందరు బీజేపీ నేతలకు ఎదురైన అనుభవాలను రాజాసింగ్ ఏకరువు పెడుతుండటంతో.. ఔను, నిజమే కదా? అంటూ నేతలు ఆలోచనలో పడుతున్నారని చెబుతున్నారు. తమ భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై తర్జనభర్జనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఎందరో నేతలు ఉన్నా, రాజాసింగ్ మాస్ ఇమేజ్ వేరు. కమలం సింబల్ తో గెలిచినా, ఆయన హిందుత్వ అజెండా కూడా గోషామహల్ వంటి నియోజకవర్గంలో రాజాసింగ్ రాణించడానికి కారణమైందని అంటున్నారు. పక్కా హిందుత్వ వాదిగా ముద్రపడిన రాజాసింగ్ కు బీజేపీలో తిరుగులేదన్న అంచనాలు ఉండేవి. బీజేపీ సిద్ధాంతాన్ని పక్కాగా అనుసరిస్తున్న రాజాసింగుకు పార్టీలో అగ్ర తాంబూలం దక్కుతుందన్న అభిప్రాయమే ఇందుకు కారణం. కానీ, రాజాసింగ్ ఆశించినట్లు బీజేపీలో సాగలేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా రాజాసింగ్ పార్టీని వీడాల్సివచ్చింది. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గంగా ముద్రపడిన రాజాసింగును ఆయన కూడా కాపాడ లేకపోయారని చెబుతున్నారు. దీంతో బీజేపీలో ఎవరు చేరాలని భావించినా, ఆ పార్టీని పూర్తిగా స్టడీ చేశాకే నిర్ణయం తీసుకోవాలని రాజాసింగ్ సలహా ఇస్తున్నారు. అయితే నేతలు ఎవరూ అడగకపోయినా రాజాసింగ్ సలహా ఇవ్వడం ఎందుకు? అన్న చర్చ కూడా జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టిన నేతలను ఇబ్బంది పెట్టడానికే రాజాసింగ్ ఈ తరహా రాజకీయాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు.
