Begin typing your search above and press return to search.

రాజాసింగ్ కి మాధవీలత తో చెక్!

తెలంగాణాలో రాజా సింగ్ అనే కరడు కట్టిన హిందూత్వ వాది ఉన్నారు. ఆయన బీజేపీలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.

By:  Tupaki Desk   |   7 July 2025 9:43 AM IST
రాజాసింగ్ కి మాధవీలత తో చెక్!
X

తెలంగాణాలో రాజా సింగ్ అనే కరడు కట్టిన హిందూత్వ వాది ఉన్నారు. ఆయన బీజేపీలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన రెండోసారి గెలిచిన తరువాత నుంచి టోన్ మారిపోయింది అని కాషాయం పార్టీ పెద్దలు అంటున్నారు. తానే అందరి కన్నా పెద్ద వాడిని అన్న భావనతో ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇలా రాజా సింగ్ హాట్ కామెంట్స్ తో సొంత పార్టీ మీద విమర్శలతో విసిగిపోయిన కాషాయం పెద్దలు ఆయనను పూర్తిగా వదిలించుకోవాలని డిసైడ్ అయిపోయారు.

ఒకనాడు ఆయనకు ఎంతో కొంత అండగా నిలిచారని చెబుతున్న తెలంగాణా మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం రాజా సింగ్ తాజా వైఖరి పట్ల గుస్సా అవుతున్నారని అంటున్నారు. దీంతో పెద్దలంతా కలసి బీజేపీ కేంద్ర నాయకత్వానికి విన్నపాలు చేసారు. ఆయనను దయచేసి పార్టీలో కొనసాగనీయవద్దు, పైగా ఆయన రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నికలు వచ్చేలా చూడండి, మీరు అనుమతిస్తే ఆయన రాసిన లేఖనే స్పీకర్ కి పంపించి ఉప ఎన్నికలు వచ్చేలా చూస్తామని లేఖ రాశారని టాక్ నడుస్తోంది.

ఈ నేపధ్యంలో కేంద్ర బీజేపీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణా బీజేపీ నేతలు అయితే రాజా సింగ్ కి చెక్ పెట్టే పనిలో పడ్డారు. అని అంటున్నారు. వారితో పాటు తెలంగాణా బీజేపీ ఇంచారి సునీల్ బన్సాల్ కూడా రాజా సింగ్ కి పోటీగా మాధవీలతను గోషామహల్ సీన్ లోకి తీసుకుని వచ్చారు అని అంటున్నారు. ఆయన ఆశీస్సులతో మాధవీలత అపుడే గోషామహల్ లో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ నేతలతో ఆమె వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అందరినీ ఆమె కలుపుకుని పోతున్నారు. గోషా మహల్ బీజేపీకి ఆమె ఇంచార్జిగా వస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రాజా సింగ్ రాజీనామా ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఆమె అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆమె 2024 ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసి ని ఢీ కొట్టారు. ఆమె గెలవకపోయినా దూకుడుగా చేసిన ప్రచారం మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. దాంతో ఆమె తెలంగాణా బీజేపీలో ప్రముఖ నాయకురాలు అయిపోయారు. కేంద్ర బీజేపీ పెద్దల దృష్టిలో కూడా ఉన్నారు.

ఇపుడు అనుకోకుండా గోషామహల్ కి కనుక ఉప ఎన్నిక వస్తే ఆమెను అభ్యర్ధిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తేవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. బీజేపీకి ఈ సీటు కంచుకోటగా ఉంది. పైగా పాతబస్తీలో ఉంది. దాంతో ఈ సీటుని ఎలాగైనా గెలుచుకోవాలని ముందస్తు ఆలోచనలతోనే మాధవీ లతను రంగంలోకి దింపారు అని అంటున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలను చూసి రాజా సింగ్ ఒకింత వెనకడుగు వేస్తున్నారు అని అంటున్నారు.

ఆయన తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆయన వెనక్కి తగ్గినా బీజేపీ తగ్గదని అంటున్నారు. అయితే ఇక్కడ స్పీకర్ నిర్ణయం ప్రధానం కాబట్టి రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి ఏమి జరుగుతుంది అన్నది చూడాలి. బీజేపీతో మాత్రం ఆయనకు ఉన్న రిలేషన్స్ పూర్తిగా కట్ అవుతాయని చెప్పేస్తున్నారు.