Begin typing your search above and press return to search.

తెలంగాణలో రాజాసింగ్ కొత్త పార్టీ.. గోషామహల్ బైపోల్ కు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే?

తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కనున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రవేశించేలా అడుగులు పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 July 2025 11:14 AM IST
తెలంగాణలో రాజాసింగ్ కొత్త పార్టీ.. గోషామహల్ బైపోల్ కు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే?
X

తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కనున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రవేశించేలా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు పార్టీలు మధ్య తీవ్ర పోటీ ఉంది. అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు రాజకీయంగా కొట్లాడుతున్నాయి. ఇక వామపక్షాలు, టీడీపీ, బీఎస్పీ వంటి కొన్ని పార్టీలు మనగడ కోసం యుద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో వీటి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీకి టాటా చెప్పేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త పార్టీ ద్వారా పోరాటానికి సిద్ధమవుతున్నవారు.

మహారాష్ట్ర మూలాలు ఉన్న రాజాసింగ్ హైదరాబాద్ లో స్థిరపడిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన రాజాసింగ్ ముందుగా కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గోషామహల్ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి 2014లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఓ మతంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మూడోసారి ఎమ్మెల్యేగా పోటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2023 ఎన్నికల్లో మూడోసారి గెలిచిన రాజాసింగ్ ఇటీవలకాలంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఆయన గతంలో చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయని అంటున్నారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మద్దతుదారు అయిన రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే ఆయన వివాదాస్పద వైఖరి మూలంగా పార్టీ పెద్దలు రాజాసింగ్ పేరును కనీసం పరిగణించలేదు. ఇదే సమయంలో పార్టీ పెద్దల ఆశీస్సులు లేకపోయినా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రాజాసింగ్ భావించారు. అయితే ఆయనకు కనీస మద్దతు దక్కకపోవడంతో పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

అదే సమయంలో బీజేపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజాసింగ్ చేసిన విమర్శలపై కమలం పెద్దలు సీరియస్గా ఉన్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసినందున ఆయనపై అనర్హత వేటు వేయించాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్లు చెబుతున్నారు. రాజాసింగ్ పై అనర్హత వేటుకు బీజేపీ లేఖ రాస్తే.. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. రాజాసింగ్ కూడా తన రాజీనామా ఆమోదించుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో కమలం పెద్దలకు తెలియజేయాలని చూస్తున్నారని అంటున్నారు.

అయితే హిందుత్వ వాదిగా ముద్రపడిన రాజాసింగ్ ను ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజాసింగ్ ను చేర్చుకోవడానికి సిద్ధంగా లేవంటున్నారు. ఇదే సమయంలో ఆయన పాత పార్టీ టీడీపీ కూడా ప్రస్తుతం రాజాసింగ్ పై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణలో శివసేన ద్వారా పోటీ చేయాలని రాజాసింగ్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం శివసేన కూడా రెండుగా విడిపోయింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఓ పార్టీ, ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే ఆధ్వర్యంలో మరో శివసేన ఉన్నాయి. ఇందులో ఉద్ధవ్ శివసేన ద్వారా రాజాసింగ్ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. త్వరలో శివసేన (యూబీటీ)లో చేరి గోషామహల్ లో ఆ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని రాజాసింగ్ చూస్తున్నారని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోపార్టీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.