Begin typing your search above and press return to search.

బీజేపీని ఆడుకుంటున్న రాజాసింగ్

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   28 July 2025 9:59 AM IST
బీజేపీని ఆడుకుంటున్న రాజాసింగ్
X

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీని ఓ రేంజ్ లో ఆయన ఆడుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు, పార్టీలోని లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్నాడు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా ప్రతిస్పందిస్తూ, తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా "ఫేక్" అని కొట్టిపారేశారు. బీజేపీలో తిరిగి చేరే ప్రసక్తే లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు.

-బీజేపీ లోపాలను బట్టబయలు చేసిన రాజాసింగ్

తెలంగాణ బీజేపీకి ఫైటర్లు అవసరమని, కానీ ప్రస్తుతం పార్టీని నడుపుతున్న నేతలు కేవలం రైటర్లు మాత్రమేనని రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మంచి రచయిత కావచ్చేమోగానీ, బీజేపీని గెలిపించే ఫైటర్ మాత్రం కాదని విమర్శించారు. పార్టీలో వెన్నుపోట్లు, లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

"నా గతి కార్యకర్తల గతిలాగే" రాజీనామా వెనుక మనస్తాపం

తాను ఎప్పుడూ పదవుల కోసమో, అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదని రాజాసింగ్ వివరించారు. బీజేపీ తనకు అవకాశం ఇవ్వదన్న విషయాన్ని ముందుగానే అర్థం చేసుకున్నానని, ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. భవిష్యత్తులో కూడా బీజేపీలో చేరే అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మండిపాటు

తాజాగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. అరవింద్ మాటలు పూర్తిగా అవాస్తవమని, తనపై దుష్ప్రచారం చేయడానికి కావాలనే ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన హితవు పలికారు.

హైకమాండ్ స్పందన లేకపోవడంపై అసంతృప్తి

తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అంశాలపై పలు లేఖలు, మెయిల్లు పంపించినా పార్టీ హైకమాండ్ స్పందించలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ కోసం కష్టపడిన వారిని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన వాపోయారు.

మాధవీలతపై ఆరోపణలు

పార్టీలోని ఓ మహిళా శక్తి బృందం ద్వారా తనపై అనవసర వ్యాఖ్యలు చేయిస్తున్నారని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేయాలంటే ముఖాముఖి చెప్పాలని, ప్రచారాల ద్వారా దూషించడం తగదని హెచ్చరించారు. "మీకు నా వల్ల భయం అక్కర్లేదు" అంటూ తాను ఎలాంటి కక్షతోనూ వ్యవహరించనని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు ఉత్కంఠ

ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మాధవీలతను పోటీకి సిద్ధం చేస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ ఏ మేరకు మారుతుందో వేచి చూడాలి. మొత్తంగా, రాజాసింగ్ స్పష్టమైన పదజాలంతో బీజేపీకి గుడ్‌బై చెప్పడంతో, బీజేపీలోని అంతర్గత రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి.