Begin typing your search above and press return to search.

బీజేపీ రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతారంటే ?

ఇక తాజాగా చూస్తే ఆయన బీజేపీ తెలంగాణా అధ్యక్ష పదవిని కూడా కోరారు. కానీ అది కూడా దక్కలేదని బాధపడుతున్నారు.

By:  Tupaki Desk   |   2 July 2025 9:06 AM IST
బీజేపీ రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతారంటే ?
X

నా గుండె కోస్తే రాముడే కనిపిస్తాడు అని చూపిస్తాడు పురాణాలలో ఆంజనేయుడు. అంతే కాదు తన దైవం అని భావించిన రాముడితోనే యుద్ధం చేస్తాడు. ఇపుడు చూస్తే రాముడు పార్టీగా పేరు పొందిన బీజేపీతో ఆంజనేయ భక్తుడిగా మారిన రాజా సింగ్ యుద్ధమే చేస్తున్నారు. గోషామహల్ నుంచి మూడు సార్లు గెలిచిన రాజా సింగ్ కరడు గట్టిన హిందూత్వ వాది.

ఆయన బీజేపీ ప్రవచించే హిందూత్వనే తానూ సొంతం చేసుకున్నారు కానీ ఆ విషయంలో మాత్రం ఆయన పార్టీ పరిధిని కూడా దాటి దూకుడు చేస్తారు అని పార్టీ నేతలు అంటారు. కానీ ఇలాగే చేయాలి. ఇలాగే చేస్తేనే తప్ప కుదరదు అన్నది రాజా సింగ్ నినాదం. అదే ఆయన తన విధానంగా చేసుకుని ముందుకు పోతున్నారు.

ఇక ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినా సీనియర్ గా ఉన్నా పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతూ చివరికి అదే పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఆయన బీజేపీ శాసనసభా పక్ష నేత పదవిని మొదట ఆశించారు. ఐతే అది దక్కలేదు.

ఇక తాజాగా చూస్తే ఆయన బీజేపీ తెలంగాణా అధ్యక్ష పదవిని కూడా కోరారు. కానీ అది కూడా దక్కలేదని బాధపడుతున్నారు. ఎన్నికలు అని ప్రకటించి తన చేత నామినేషన్ వేయించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు.

ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రాదని ఆయన తెగేసి చెప్పేస్తున్నారు. ఇక ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీదనే తన విమర్శలు ఎక్కు పెడుతున్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేదని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాను బీజేపీకి పార్టీ పదవికి రాజీనామా చేశాను కాబట్టి తన రాజీనామాను ఆమోదించమని స్పీకర్ కి పార్టీ లేఖ రాయాలని ఆయన కోరుతున్నారు. తాను బీజేపీ వదిలేసినా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ లో కానీ చేరేది లేదని ఆయన అంటున్నారు. హిందూత్వ వ్యతిరేక పార్టీలలో చేరను అని స్పష్టం చేస్తున్నారు.

ఇక బీజేపీని వదిలేసినా హిందూత్వాన్ని ప్రజలలో ఉంటూ ప్రచారం చేస్తాను అని ఆయన చెప్పడం విశేషం. ఇక తనకు బీజేపీలో ఇష్టమైన నాయకులు నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ అని ఆయన అన్నారు.

తన రాజీనామా మీద బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూస్తాను అని ఆయన కోసమెరుపు మెరిపించారు. మొత్తానికి చూస్తే రాముడి పార్టీ బీజేపీలో ఆజనేయుడు మాదిరిగా రాజా సింగ్ మారి యుద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. తొందరలో ఆయన రాజీనామాను వెనక్కి తీసుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.