Begin typing your search above and press return to search.

పాక్ జెండాలతో రాజాసింగ్ సంచలనం.. పోలీసుల తీరుపై ఫైర్

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ పరిచయం చేయాల్సిన అవసరం లేని బీజేపీ నేత కం గోషామహల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు రాజాసింగ్.

By:  Tupaki Desk   |   30 April 2025 10:49 AM IST
పాక్ జెండాలతో రాజాసింగ్ సంచలనం.. పోలీసుల తీరుపై ఫైర్
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ పరిచయం చేయాల్సిన అవసరం లేని బీజేపీ నేత కం గోషామహల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు రాజాసింగ్. తరచూ ఏదో ఒక సంచలనంతో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన వినూత్న నిరసనకు తెర తీశారు. తన పార్టీ కార్యాలయం ఎంట్రన్స్ లో పాకిస్థాన్ జాతీయ జెండాల్ని నేలకు అతికించారు.

అక్కడే తన పార్టీ ఆఫీసుకు వచ్చే సందర్శకుల పాదరక్షల్ని అక్కడ ఉంచేలా చేయటంతో పాటు.. పాక్ జెండా మీద నుంచి నడిచేలా చేశారు. దీనిపై స్థానిక పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఏర్పాటు చేసినవి పాకిస్తాన్ జెండాలని.. వేరేవి కాదని ఆయన పేర్కొన్నారు. కావాలంటే గూగుల్ లో చెక్ చేసి చూడాలని కోరారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఆ జెండాల్ని తొలగించారు.

ఈ వ్యవహారంపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థానోళ్లు.. భారత జాతీయ జెండాలను నేలమీద పరిచి.. వాటి మీద నుంచి నడుస్తున్నారని.. అలాంటప్పుడు తాము పాక్ జాతీయ జెండాల మీద ఎందుకు నడవకూడదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పోలీసులు పాక్ జెండాను.. ఇతర జెండా మధ్య తేడా గుర్తించలేని కన్ఫ్యూజన్ లో ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో రాజాసింగ్ ఆఫీసు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది.