Begin typing your search above and press return to search.

టీడీపీతో మొదలుపెట్టి.. బీజేపీతో కొనసాగిస్తున్నా.. రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కొద్ది రోజులుగా తన పొలిటికల్ లైఫ్ పై వస్తున్న గాసిప్స్ పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 2:52 PM IST
టీడీపీతో మొదలుపెట్టి.. బీజేపీతో కొనసాగిస్తున్నా.. రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

కొద్ది రోజులుగా తన పొలిటికల్ లైఫ్ పై వస్తున్న గాసిప్స్ పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలతో విభేదిస్తున్న రాజాసింగ్ త్వరలో పార్టీ మారతారని ఒకసారి, కొత్త పార్టీ పెడతారని మరోసారి కొద్దిరోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. అయితే తనతో కొంత మంది ఆట ఆడుతున్నారని భావిస్తున్న రాజాసింగ్, కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు 14 నెలల పాటు బీజేపీకి దూరంగా ఉన్నా, తాను వేరే పార్టీలో చేరలేదని, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు.

కొన్ని చానళ్లలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజాసింగ్ వేరే పార్టీలోకి వెళతారా.. వేరే పార్టీని తీసుకుని వస్తారా.. లేక వేరే పార్టీ పెడతారా అనే చర్చ జరుగుతోంది.’’ అని చెప్పిన ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో తాను 14 నెలలు పార్టీకి దూరంగా ఉన్నప్పుడే వేరే పార్టీలోకి వెళ్లలేదన్న విషయాన్ని గమనించాలని కోరారు. వేరే పార్టీని తీసుకురాలేదని, వేరే పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు.

తాను బీజేపీలో తప్ప మరో పార్టీలో రాజకీయాలు చేయనని ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తనతో కొంత మంది ఆడుకుంటున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో తప్ప మరో పార్టీలోకి వెళ్లనన్న విషయం వారికి తెలుసన్న ఆయన.. తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచనలో కొందరు ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను చూసి తాను బీజేపీలో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. తాను టీడీపీలో రాజకీయం మొదలుపెట్టానని.. తర్వాత బీజేపీలోకి వచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీతో తప్ప మరే పార్టీతోనూ రాజకీయంగా నడుచుకోలేనని ప్రకటించారు.

తాను పార్టీ మారతానంటూ ప్రచారం చేస్తున్నవారిని వదిలిపెట్టనని రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ చెవులు లేని వాళ్లని అడిగితే ఏం లాభాం..? చెవులు ఉన్నవారిని అడిగితే ఫలితం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రధాని మోదీ మంచి నాయకుడంటూ కితాబునిచ్చిన రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీని కలవాలని సూచించారు.