మనిషి తలతో సూపే తాగే నరమాంస భక్షకుడు.. కోలందర్ అండ్ కోకు జీవితఖైదు
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణమైన నేరాలకు పాల్పడిన ఒక సీరియల్ కిల్లర్ కథ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
By: Tupaki Desk | 26 May 2025 11:18 AM ISTఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణమైన నేరాలకు పాల్పడిన ఒక సీరియల్ కిల్లర్ కథ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మనుషులను హత్య చేయడమే కాకుండా, వారి శరీర భాగాలతో దారుణమైన చర్యలకు పాల్పడేవాడనే ఆరోపణలున్న రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతని సహచరుడు బక్ష్‌రాజ్‌కు లక్నో కోర్టు శుక్రవారం జీవితఖైదు విధించింది. ఈ కేసులో కోలందర్ ఒక భయంకరమైన నరమాంస భక్షకుడని, మనిషి తలను మరిగించి సూప్ తాగేవాడని పోలీసులు తెలిపారు. తీర్పు వెలువడే సమయంలో కోర్టు గదిలో కోలందర్ నవ్వుతూ కనిపించడం, అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం, భయం లేకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ సీరియల్ కిల్లర్ రాజా కోలందర్ నేరాల బండారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్ట్ ధీరేంద్రసింగ్ హత్య కేసుతో మొదట వెలుగులోకి వచ్చింది. ధీరేంద్రసింగ్ హత్య కేసులో కోలందర్‌పై మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు వారికి ఊహించని నిజాలు తెలిశాయి. కోలందర్ ఒక సామాన్యమైన నేరస్థుడు కాదని, అతని వెనుక అనేక భయంకరమైన హత్యల చరిత్ర ఉందని స్పష్టమైంది. ధీరేంద్రసింగ్ హత్యకేసు దర్యాప్తు కోసం పోలీసులు కోలందర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ వారికి మనిషి పుర్రెలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని కోలందర్‌ను మరింత లోతుగా ప్రశ్నించగా, అతను చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
పోలీసుల విచారణలో కోలందర్ తన భయంకరమైన నేరాలను ఒప్పుకున్నాడు. పాతికేళ్ల కిందట అంటే 2000 సంవత్సరంలో మనోజ్ అనే వ్యక్తిని, అతని డ్రైవర్ రవిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. వారి మృతదేహాలను ముక్కలుగా నరికి, వాటిని పూడ్చిపెట్టినట్లు కోలందర్, బక్ష్‌రాజ్ వెల్లడించారు. ఇది వారిలోని మానవత్వపు ఛాయలను పూర్తిగా తుడిచిపెట్టిన పాశవిక చర్యలకు అద్దం పడుతోంది.
అంతేకాకుండా, జర్నలిస్ట్ ధీరేంద్రను పిప్రీలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించి చంపినట్లు కూడా కోలందర్ తెలిపాడు. అతని ఇంట్లో పోలీసులు 14 హత్యలను ప్రస్తావించిన ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇది కోలందర్ కేవలం ఇద్దరి హత్యలకే పరిమితం కాలేదని, ఒక సీరియల్ కిల్లర్‌గా అనేక మందిని బలిగొన్నాడని స్పష్టం చేసింది. శంకర్‌గఢ్‌కు చెందిన రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, మొదట్లో చోకిలోని సెంట్రల్ ఆర్డినెన్స్ స్టోర్‌లో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేసేవాడు. అయితే, అతను తనను తాను ఒక రాజుగా భావించేవాడు. అందుకే తన పేరులో 'రాజా'ను చేర్చుకున్నాడు. అంతేకాదు, తన భార్యను కూడా బందిపోటు రాణి అయిన 'పూలన్‌దేవి'గా పిలిచేవాడు. న్యాయస్థానం జీవితఖైదు విధించినప్పటికీ, కోర్టు గదిలో కోలందర్ నవ్వుతూ కనిపించడం, అతనిలోని నిర్లక్ష్యం, భయం లేని స్వభావాన్ని చాటి చెప్పింది.
