రాజ్ తరుణ్ - లావణ్య వివాదంలో ఒక పాత వీడియో వైరల్!
తాజాగా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ లావణ్య ఒక పాత వీడియోను విడుదల చేశారు.
By: Tupaki Desk | 20 April 2025 4:00 PM ISTటాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలిగా చెబుతున్న లావణ్య మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం, ముఖ్యంగా ఓ విలాసవంతమైన విల్లా యాజమాన్యం చుట్టూ వివాదం ముదురుతోంది.
తాము 2014లోనే వివాహం చేసుకున్నామని లావణ్య గతంలో వెల్లడించినప్పటికీ, ఇప్పటివరకు వారి పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో గానీ, వీడియో గానీ బయటకు రాలేదు. ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుండి రాజ్ తరుణ్ చాలా మౌనంగా ఉంటున్నారు.
ఇటీవల రాజ్ తరుణ్‌కు చెందినదిగా చెప్పబడుతున్న విల్లాలోకి ఆయన తల్లిదండ్రులు ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే, ప్రస్తుతం ఆ విల్లాలోనే నివాసం ఉంటున్న లావణ్య వారిని అడ్డుకోవడంతో విషయం పెద్దదైంది. ఈ సంఘటనల నేపథ్యంలో లావణ్య గత రెండు రోజుల్లో రెండుసార్లు పోలీసులను ఆశ్రయించారు.
తాజాగా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ లావణ్య ఒక పాత వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాజ్ తరుణ్, లావణ్య కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. విల్లా యాజమాన్యంపై గొడవ తారాస్థాయికి చేరిన సమయంలో ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విల్లా యాజమాన్యంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఆ విల్లా తమ కుమారుడు రాజ్ తరుణ్‌దేనని ఆయన తల్లిదండ్రులు వాదిస్తున్నారు. మరోవైపు, ఆ విల్లా నిర్మాణానికి తాను కూడా ఆర్థికంగా సహాయం చేశానని, అందుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని లావణ్య గట్టిగా చెబుతున్నారు.
ఈ మొత్తం వివాదంలో రాజ్ తరుణ్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన లావణ్యను ఎదుర్కోవడానికి ఇష్టపడటం లేదని, ప్రస్తుతానికి ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ విడుదలైన వీడియోతో వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
