ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్ యూట్యూబర్.. ఏకంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ తో?
భారతీయ యూట్యూబ్ చరిత్రలో ఇదొక సంచలనం.. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ రాజ్ శమాని ఏకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఇంటర్వ్యూ చేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు.
By: Madhu Reddy | 20 Feb 2026 12:00 AM ISTభారతీయ యూట్యూబ్ చరిత్రలో ఇదొక సంచలనం.. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ రాజ్ శమాని ఏకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఇంటర్వ్యూ చేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు. పెద్ద పెద్ద నేషనల్ మీడియా ఛానళ్లకు కూడా దక్కని అవకాశం ఒక యూట్యూబర్‌కు దక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 14.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో దూసుకుపోతున్న రాజ్, గ్లోబల్ లీడర్లను తన పాడ్‌కాస్ట్‌కు రప్పించి డిజిటల్ మీడియా పవర్‌ను చాటిచెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
నేషనల్ మీడియాకు దక్కని ఛాన్స్:
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖ జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ కోసం పోటీ పడ్డారు. కానీ ఆయన ఎవరికీ దొరకలేదు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాజ్ శమాని తన పాడ్‌కాస్ట్ 'ఫిగరింగ్ అవుట్' కోసం మాక్రాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఒక దేశాధినేత ఒక స్వతంత్ర యూట్యూబర్‌తో కూర్చుని ముచ్చటించడం అనేది మారుతున్న కాలానికి నిదర్శనం. యువతకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే మాక్రాన్ ఈ వేదికను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి కూర్చున్న ఫోటోలు చూస్తుంటే, ఒక సాదాసీదా కుర్రాడు ప్రపంచ స్థాయి నాయకుడిని ఎదురుగా కూర్చోబెట్టుకోవడం గర్వంగా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గతంలో బిల్ గేట్స్.. ఇప్పుడు మాక్రాన్:
రాజ్ శమానికి ఇలాంటి ఇంటర్వ్యూలు కొత్తేమీ కాదు. గతంలోనే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అంతరిక్ష వీరురాలు సునీతా విలియమ్స్, అంతర్జాతీయ బిజినెస్ మ్యాగ్నెట్ విజయ్ మాల్యా వంటి దిగ్గజాలను ఆయన ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించారు. యూట్యూబ్‌లో 14.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉండటం అనేది ఒక ఎత్తయితే, ప్రపంచ స్థాయి సెలబ్రిటీలను మెప్పించి తన షోకి రప్పించడం మరో ఎత్తు.ఇక కేవలం బిజినెస్ విషయాలే కాకుండా, ఒక వ్యక్తి సక్సెస్ వెనుక ఉన్న కష్టాలను రాజ్ అడిగే తీరు సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఇప్పుడు గ్లోబల్ లీడర్లు సైతం తమ భావాలను పంచుకోవడానికి రాజ్ పాడ్‌కాస్ట్‌ను ఉత్తమ వేదికగా భావిస్తున్నారు.
యూట్యూబ్ పవర్:
ఈ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూఈ రోజు రాత్రి 9గంటల 9 నిమిషాలకు జరగనుంది. ఇక ఈ ఇంటర్వ్యూ ప్రోమో చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. అదేంటంటే, నేటి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే డిజిటల్ మీడియాకే పవర్ ఎక్కువని. ఒకప్పుడు కేవలం టీవీ ఛానళ్లకే పరిమితమైన ఇలాంటి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇప్పుడు మొబైల్ ఫోన్లలో యూట్యూబ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. రాజ్ శమాని వంటి వారు కేవలం కంటెంట్ క్రియేటర్లుగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచుతున్నారు. మాక్రాన్ వంటి నాయకులు నేరుగా ప్రజలతో, ముఖ్యంగా యువతతో మాట్లాడటానికి యూట్యూబ్‌ను ఎంచుకోవడం డిజిటల్ విప్లవానికి నిలువుటద్దం. మరి ఈ పూర్తి ఇంటర్వ్యూలో మాక్రాన్ ఎలాంటి ఆసక్తికర విషయాలు చెప్పారో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే..
