రాజ్ కేసిరెడ్డి కేసు నుంచి నేర్చుకోవాల్సినది ఇదే..
రాజ్ కేసిరెడ్డి ఓ ఎన్నారై. 2019 ఎన్నికల ముందు వరకు విదేశాల్లో ఉద్యోగం చేసుకునే రాజ్.. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో క్రియాశీల పాత్ర పోషించారు.
By: Tupaki Desk | 28 April 2025 12:33 PM ISTరాజ్ కేసిరెడ్డి, సాధారణ, నిరాండబరమైన కుటుంబానికి చెందిన వ్యక్తి డబ్బు సంపాదించాలనే అత్యాశతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడమే కాకుండా, తన వారి అందరినీ ఇబ్బంది పెడుతున్న వైనం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. లిక్కర్ స్కాంలో అతడి పేరు బయటకు వచ్చే వరకు రాజ్ కేసిరెడ్డి కోసం ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన పుట్టుపుర్వోత్తారాలు ఏంటి? భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, ఇలాంటి వ్యక్తిగత సమాచారం మొత్తం తెలుసుకోవాలని అంతా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కేవలం రాజ్ కేసిరెడ్డి వల్ల మిగిలిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
రాజ్ కేసిరెడ్డి ఓ ఎన్నారై. 2019 ఎన్నికల ముందు వరకు విదేశాల్లో ఉద్యోగం చేసుకునే రాజ్.. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో క్రియాశీల పాత్ర పోషించారు. చురుకైన వాడు, బాగా చదువుకున్నవాడు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాడు కావడంతో వైసీపీ కూడా రాజ్ కేసిరెడ్డిని తొలుత బాగా ప్రోత్సహించేంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మొదలుకుని వైసీపీలో ఎందరో నేతలకు తలలో నాలుకలా వ్యవహరించాడు రాజ్ కేసిరెడ్డి. ఇంతింతై వటుడింతై అన్నట్లు వైసీపీలో అంచలంచెలుగా ఎదిగి మాజీ ముఖ్యమంత్రి జగన్ సలహాదారు బృందంలో చేరిన రాజ్ కేసిరెడ్డి అక్రమ సంపాదనపై ఆశతో ఇప్పుడు కటకటాలపాలైనట్లు చెప్పుకుంటున్నారు.
సాధారణ కుటుంబానికి చెందిన రాజ్ కేసిరెడ్డి మద్యం స్కాంతో అత్యంత సంపన్నడిగా మారిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం వ్యాపారంలోకి దిగిన తర్వాత ఆయన ఎదుగుదలకు సహకరించిన వారంతా దూరమైనట్లు చెబుతున్నారు. దీంతో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను ఏ ఒక్కరూ పలకరించేందుకు కూడా రావడం లేదని అంటున్నారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రాజ్ కేసిరెడ్డి అరెస్టును ఖండించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టు విషయమై మాట్లాడిన మాజీ సీఎం జగన్ తన మాజీ సలహాదారు కేసిరెడ్డి ప్రస్తావన తేకుండా జాగ్రత్త పడటం చూస్తే కేసిరెడ్డి స్వయంకృతాపరాధమేనంటున్నారు.
ఇదేసమయంలో వైసీపీ నేతలు కూడా కేసిరెడ్డి విషయమై ఎక్కడా మాట్లాడటం లేదు. మరోవైపు కేసులో ఇరుక్కుని కేసిరెడ్డి తోబుట్టువులు, సమీప బంధువులు జైలు పాలవుతున్నారు. దీనంతటికీ కేసిరెడ్డి ఉన్న ధన వ్యామోహమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నమ్మిన వారిని మోసం చేస్తే చివరికి ఒంటరిగా మిగిలిపోతామనే విషయాన్ని రాజ్ కేసిరెడ్డి ఉదంతంలో తెలుస్తోందని అంటున్నారు.
