లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న రాజ్ కాశిరెడ్డి అమెరికాకు వెళ్లిపోయారా?
గత వారం హైకోర్టు రాజ్ కాశిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
By: Tupaki Desk | 12 April 2025 3:49 AMవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమాచార సాంకేతిక పరిజ్ఞాన సలహాదారుగా పనిచేసిన కాశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలియాస్ రాజ్ కాశిరెడ్డి భారీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆరోపణలు రావడంతో సైలెంట్ గా దేశం విడిచి అమెరికాకు చేరుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవం ఎంతో కానీ ఇప్పుడు ఆయన ఆచూకీ తెలియడం లేదని సమాచారం. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం నిర్వహించాల్సిన విచారణకు రాజ్ కాశిరెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. ఆయన ఉద్దేశపూర్వకంగా తప్పించుకున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం పోలీసులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించగా ఆయన కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్లిపోయారని తెలిసి అధికారులు షాక్ తిన్నారు. గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన దేశం విడిచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
జగన్‌కు దూరపు బంధువైన రాజ్ కాశిరెడ్డి, వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌కు సూత్రధారి అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి కూడా రాజ్ కాశిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్‌కు "కర్త-కర్మ-క్రియ" అని బహిరంగంగా పేర్కొనడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.
గత వారం హైకోర్టు రాజ్ కాశిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే అరెస్టు భయంతో ఆయన అమెరికాకు పారిపోయారని సమాచారం.
సిట్ దర్యాప్తు ప్రకారం.. రాజ్ కాశిరెడ్డి ప్రభుత్వ మద్యం దుకాణాలకు తక్కువగా తెలిసిన మద్యం బ్రాండ్ల సరఫరాను నియంత్రించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన మద్యం కంపెనీల నుండి నెలకు కనీసం ₹60 కోట్ల కమీషన్లు వసూలు చేసి, దాదాపు ₹3,000 కోట్లను ఉన్నత స్థాయి వ్యక్తులకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు నిగ్గుతేల్చి ఆయనకు నోటీసులు జారీ చేశారు.
సిట్ సేకరించిన ఆధారాల ప్రకారం.. రాజ్ కాశిరెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని ఒక ప్రత్యేక కార్యాలయం నుండి ఈ మొత్తం కిక్‌బ్యాక్ నెట్‌వర్క్‌ను నిర్వహించారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని ఒక సీనియర్ నాయకుడితో తన కార్యకలాపాలను సమన్వయం చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.. రాష్ట్రంలోని మద్యం పంపిణీ వ్యవస్థను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకుని, ఏ రోజు ఏ మద్యం బ్రాండ్లు, ఎంత పరిమాణంలో కొనుగోలు చేసి పంపిణీ చేయాలనేది ఆయనే నిర్ణయించేవారని ఆరోపణలు ఉన్నాయి.
రాజ్ కాశిరెడ్డి దేశం విడిచి వెళ్లడం లిక్కర్ స్కామ్ దర్యాప్తుకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పోలీసులు ఆయనను తిరిగి రప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.