బట్టేబాజ్ విజయసాయిరెడ్డి.. రాజ్ కసిరెడ్డి సంచలన ఆడియో
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ విచారణ ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు కేసులో పాత్రధారులు, సూత్రధారులుగా చెబుతున్న వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
By: Tupaki Desk | 19 April 2025 12:31 PMమద్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి సంచలన ఆడియో విడుదల చేశారు. తనపై వైసీసీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ తగిన సమయంలో విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానంటూ హెచ్చరించారు. మద్యం స్కాంలో తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తున్నానని వివరించారు. కోర్టు తీర్పు తర్వాత విచారణకు సహకరిస్తానని ఆ వీడియోలో రాజ్ కసిరెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ విచారణ ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు కేసులో పాత్రధారులు, సూత్రధారులుగా చెబుతున్న వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా మద్యం స్కాంలో కర్త, కర్మ, క్రియా అంతా మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్న విషయం తెలిసిందే. గత నెలలో ఒకసారి ఈ విషయాన్ని చెప్పిన విజయసాయిరెడ్డి.. శుక్రవారం సిట్ విచారణ అనంతరం మళ్లీ అదే మాట చెప్పారు. మరోవైపు సిట్ విచారణకు రాకుండా పరార్ అయిన రాజ్ కసిరెడ్డిపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో మద్యం స్కాంలో తన పాత్ర లేదని, విజయసాయిరెడ్డి చెప్పిన మాటలను వింటూ మీడియా ఒకే రకమైన వాదన వినిపిస్తోందని రాజ్ కసిరెడ్డి తన ఆడియో సందేశంలో ఆరోపించారు. తన వాదనను కూడా మీడియా ప్రచారం చేయాలన్నారు. మద్యం స్కాంపై తనను సాక్షిగా పేర్కొంటూ విచారణకు రమ్మని పోలీసులు నోటీసిచ్చారని చెప్పారు. అయితే తన న్యాయవాదులు సలహా మేరకు ఆ నోటీసులపై హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశానని వెల్లడించారు. నోటీసులు ఇచ్చిన సమయంలో తాను విచారణకు వచ్చే సమయంలో ఏమైనా రికార్డులు తేవాలా? అని కూడా సిట్ అధికారులను కోరినట్లు చెప్పారు.
కానీ, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం పదేపదే తన పేరు చెబుతుండటం, దాన్ని మీడియా అంతే ప్రాధాన్యమిస్తూ ప్రచారం చేయడంపై రాజ్ కసిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘బట్టేబాజ్ విజయసాయిరెడ్డి’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి వ్యవహారాలన్నీ తనకు తెలుసుని, తగిన సమయంలో ఆయన బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు.