సిట్ విచారణకు కసిరెడ్డి.. ఏం అడుగుతారు? ఏం చెబుతాడు!
వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ బంధువు రాజ్ కసిరెడ్డిని లిక్కర్ స్కాంలో సిట్ విచారించనుంది.
By: Tupaki Desk | 9 April 2025 11:49 AM ISTవైసీపీ నేత, మాజీ సీఎం జగన్ బంధువు రాజ్ కసిరెడ్డిని లిక్కర్ స్కాంలో సిట్ విచారించనుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్ ఎదుట హాజరుకావాల్సివుంది. దీంతో విచారణలో సిట్ ఏ ప్రశ్నలు అడగనుంది? రాజ్ కసిరెడ్డి ఏ సమాధానాలు చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ ద్వారా సుమారు మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు తొలిసారి ఓ వైసీపీ నేతను విచారించనున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో బుధవారం కీలక పరిణామం జరగనుంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఐటీ శాఖ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు విచారించనున్నారు. అయితే లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డేనంటూ వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి ఆరోపించినా, సిట్ అధికారులు మాత్రం ఆయనను సాక్షిగా విచారించేందుకు పిలిచారు. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఏ ప్రశ్నలు వేస్తారు? అందుకు ఆయన ఎలాంటి సమాధానాలు చెబుతారనే ఆసక్తి పెరుగుతోంది.
రాజ్ కసిరెడ్డిని విచారణకు రమ్మంటూ పోలీసులు మూడు నోటీసులు జారీ చేశారు. తొలి రెండు నోటీసులను లెక్కచేయని ఆయన తొలుత హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రెండు చోట్లా ఆయనకు ఎదురుదెబ్బే తగలడంతో బుధవారం విచారణకు రావాల్సిన పరిస్థితి ఎదురైందని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తో కలిసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి, ఎన్నికల అనంతరం ఏపీ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే ఆయన ఆ విధులు కన్నా, ప్రభుత్వ మద్యం కొనుగోలు, అమ్మకాలనే ఎక్కువ పర్యవేక్షించేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మద్యం ఉత్పత్తిదారుల నుంచి కమీషన్లు తీసుకోవడం, వాటిని వైసీపీ పెద్దలకు అందజేయడంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం ఉందని చెబుతున్నారు. దీనికి మద్దతుగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే లిక్కర్ స్కాం కర్త, కర్మ, క్రియ అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. దీంతో ఈ రోజు విచారణ హైటెన్షన్ పుట్టిస్తోంది.
