Begin typing your search above and press return to search.

స్కూటరు, లక్ష, తులం బంగారం... కాంగ్రెస్ హామీల వర్షం!

అవును... ములుగు జిల్లా రామాంజిపురంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ భారీ ఎత్తున జరిగింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:16 AM GMT
స్కూటరు, లక్ష, తులం  బంగారం... కాంగ్రెస్  హామీల వర్షం!
X

తెలంగాణలో ఎన్నికల సందడి పీక్స్ లోకి వెళ్లిపొతోంది. సందడే సందడి అన్నట్లుగా సాగుతోంది. ప్రధానంగా మానిఫెస్టోలు వెలువడుతున్న నేపథ్యంలో... ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా హామీల వర్షాలు కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇప్పటికే బీఆరెస్స్ మానిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా రైతులు, తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ ని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో హామీలు ఇచ్చింది. ఇందులో అమ్మాయిలకు స్కూటర్లు ఒకటి!

అవును... ములుగు జిల్లా రామాంజిపురంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ భారీ ఎత్తున జరిగింది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న ప్రియాంక గాంధీ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీఆరెస్స్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా... ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రియాంక గాంధీ ఫైరయ్యారు.

ఈ సందర్భంగా... బీఆరెస్స్, బీజేపీ ఒకటేనని చెప్పిన ప్రియాంక.. బీఆరెస్స్ రిమోట్ మోడీ చేతిలో ఉందని ఆరోపించారు. ఇదే క్రమంలో తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. అందులో భాగంగా... శ్యాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ మాఫియాతో బీఆరెస్స్ ప్రభుత్వం నిండిపోయిందని ఆమె విమర్శించారు. అదేవిధంగా... రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూములను బీఆరెస్స్ పెద్దలు లాక్కున్నారని.. బంగారు తెలంగాణ అని ప్రజలను మోసం చేశారని కేసీఆర్‌ పై ప్రియాంక ఫైరయ్యారు.

అనంతరం... తెలంగాణలో సుమారు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పిన ప్రియాంక గాంధీ... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. ఇదే క్రమంలో 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఫైరయ్యారు.

ఇందులో భాగంగా... తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుందని విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా... తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చిందన్న రేవంత్ రెడ్డి... సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది... కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని వ్యాఖ్యానించారు. అందువల్లే... తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అమరులు, నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేసిన కేసీఆర్... రాష్ట్రంలో ఎక్కడ చూసినా, అవినీతి అరాచకం రాజ్యమేలేలా చేశారని మండిపడ్డారు. ఇక, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, అలా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీని, వ్యక్తులను ఆదరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గంటల సత్యనారాయణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రైతులకు ఏటా 15 వేల రూపాయలు, కళ్యాణ లక్ష్మి క్రింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇలా ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ద్వారా వచ్చిన ఈ హామీలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.