టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లకు షాక్.. ఆస్తులు జప్తు చేసిన ఈడీ
దేశం తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడిన ఇద్దరు టీమ్ ఇండియా క్రికెటర్లకు భారీ షాక్ తగిలింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి కావడం గమనార్హం.
By: Tupaki Desk | 6 Nov 2025 5:44 PM ISTదేశం తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడిన ఇద్దరు టీమ్ ఇండియా క్రికెటర్లకు భారీ షాక్ తగిలింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి కావడం గమనార్హం. మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తీసుకున్న ఈ చర్య సంచలనంగా మారుతోంది. మరికొందరు క్రికెటర్లు, ఇతర ప్రముఖులకూ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ ప్రముఖుల్లో సినీ, రాజకీయాలకు చెందినవారు కూడా ఉండడం ప్రాధాన్యంగా మారింది. దేశ యవతను కొంతకాలం కిందటి వరకు బెట్టింగ్ యాప్ ల భూతం వేధించిన సంగతి తెలిసిందే. ఆ విష వలయంలో చిక్కకుని ఎందరో ప్రతిభావంతులైన యువకులు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. అప్పుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారూ ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్ ల కట్టడికి చర్యలు చేపట్టింది. అయితే, అప్పటివరకు వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖులకు చిక్కులు వచ్చి పడ్డాయి. తెలిసో తెలియకో వీటిని ప్రమోట్ చేసిన కొందరు వివాదాల్లో చిక్కుకున్నారు. వీరిలో టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ సురేశ్ రైనా, ఓపెనర్ శిఖర్ ధావన్ ఉన్నారు.
రూ.11 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
రైనా, ధావన్ లకు చెందిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ తాజాగా జప్తు చేసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఇది కీలక పరిణామంగా భావించవచ్చు. ఇదే కేసులో టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప కూడా ఉండడం గమనించదగిన అంశం.
సోనూ సూద్ కూ తప్పదా?
కొవిడ్ వంటి మహమ్మారి ప్రబలిన సమయంలో విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా హీరో వర్షిప్ పొందాడు బహు భాషా నటుడు సోనూ సూద్. రూ.కోట్లు దానం చేసిన అలాంటివాడు కూడా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో ఉన్నాడు. అతడితో పాటు నటి ఊర్వశీ రౌతేలా, పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, నటుడు అంకుశ్ హజ్రాలనూ ఇప్పటికే ఈడీ విచారించింది.
వారిద్దరూ చేసిన తప్పంటి..?
రైనా, ధావన్ లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ 1ఎక్స్ బెట్, దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలన్నీ విదేశీ సంస్థలు కుదుర్చుకున్నవి. వీరికి నిబంధనలు అన్నీ తెలిసినా ఇలా చేశారని పేర్కొంది. అందుకే ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల స్తిరాస్థి, రైనా రూ.6.64 కోట్ల మ్యూచ్ వల్ ఫండ్లను సీజ్ చూస్తే తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. మరి వీటిని ఎప్పుడు వెనక్కు తీసుకుంటుందో? అసలు ఎప్పుడు వెనక్కు వస్తాయో చూడాలి.
