Begin typing your search above and press return to search.

మోడీకి ఒకే రోజు రెండు షాకులిచ్చిన రాహుల్

రోజు వ్యవధిలో రెండు షాకులిచ్చిన రాహుల్ తీరును చూస్తే.. మోడీ చేస్తున్న తప్పులు ఇట్టే అర్థమవుతాయి.

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:30 PM GMT
మోడీకి ఒకే రోజు రెండు షాకులిచ్చిన రాహుల్
X

పవర్ ఫుల్ ఇంజిన్ అయినప్పటికీ.. దానికో డేట్ ఉంటుంది. అప్పటివరకు అద్భుతంగా పని చేసినా.. దాని టైం దగ్గరకు వచ్చినప్పుడు మొదట్లో మాదిరి పని చేయటం ఉండదు. ఇది మెషిన్లకు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్న మహా మహానేతలకు ఇది తప్పదు. ఎగిసే కెరటం కింద పడటం ఎంత కామనో.. అదే రీతిలో తోపు నేతలు సైతం తమ టైం దగ్గర పడే కొద్దీ తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. నిజమే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి ఎదురొడ్డి నిలిచే మొనగాడు నేత ఎవరు లేరు ఈ దేశంలో. ఆ మాటను కాదనలేం. కానీ.. టైం అన్నది చూశారా.. అదెలాంటి వారినైనా మార్చేస్తుంది. మడత బెట్టేస్తుంది.

తెలంగాణ రాజకీయాలే ఇందుకు నిదర్శనం. మూడు నెలల ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెబితే నమ్మేవారా? చివరకు ఆయనకు ఆయన సైతం నమ్మే వారు కాదేమో. ప్రజాస్వామ్యంలో అందునా.. భారత్ లాంటి దేశంలో ప్రజల నిర్ణయం ఎప్పుడైనా మారిపోవచ్చు. అదే ఈ దేశానికున్న అద్భుతమైన బలం. తిరుగులేదన్నట్లుగా వెలిగిపోయిన వారి వెలుగును ఓటుతో ఆర్పేయటం దేశ ప్రజలకు మామూలే. అలాంటప్పుడు మోడీ మాత్రం మినహాయింపు ఎందుకు అవుతారు?

ఇటీవల కాలంలో మోడీ సర్కారు చేస్తున్న తప్పులు అన్ని ఇన్ని కావు. నీతులు చెప్పే పెద్దమనిషి.. సభలో జరిగిన పరిణామాల్ని చూసినోళ్లు ముక్కున వేలేసుకునే పరిస్థితి. సమకాలీన భారతంలో పార్లమెంట్ లో విపక్షానికి చెందిన అంత మంది ఎంపీలను సింఫుల్ గా సస్పెన్షన్ వేటు వేయటం చూసింది లేదు. అంతేనా.. లోక్ సభలోకి ఆందోళనకారులు దూసుకొచ్చి.. పొగ బాంబులతో ఆగమాగం చేసిన చరిత్ర మోడీ జమానాకే దక్కింది.

ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారులో మరకలు బాగానే కనిపిస్తాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా భారత్ రెజ్లింగ్ సమాఖ్య చుట్టూ అల్లుకున్న వివాదం.. నెలల తరబడి సాగుతున్నా.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న ఎందరో క్రీడాకారులు తమ ఆటను వదిలేసి.. రోడ్ల మీదకు వచ్చి నిరసనలు.. ఆందోనలు చేస్తున్నా దేశ ప్రధానమంత్రికి పట్టకపోవటం మోడీ వైఫల్యమే అవుతుంది. తమకు ప్రభుత్వాలు ఇచ్చిన జాతీయ పురస్కారాల్ని సైతం తిరిగి ఇచ్చేందుకు వెనుకాడని పరిస్థితిని చూస్తే.. తప్పుల చిట్టా అంతకంతకూ పెరుగుతుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇలాంటివేళ.. యువరాజుగా.. అమూల్ బేబీగా ఒకప్పుడు పేరున్న రాహుల్ గాంధీ.. తనకున్న బిరుదుల్ని పక్కన పడేసి.. ప్రజల్లో మమేకం అయ్యేందుకు ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సామాన్యుడి హోదాతో ప్రధానమంత్రి అయిన మోడీ.. ఇప్పుడు అదే సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేని రీతిలో తయారైన వేళ.. ఆయనకు వరుస షాకులు ఇచ్చేస్తున్న రాహుల్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రోజు వ్యవధిలో రెండు షాకులిచ్చిన రాహుల్ తీరును చూస్తే.. మోడీ చేస్తున్న తప్పులు ఇట్టే అర్థమవుతాయి. అందులో మొదటిది.. భారత రెజ్లింగ్ సమాఖ్య వివాదం అంతకంతకూ ముదురుతున్న వేళ.. నిరసన చేస్తున్న అంతర్జాతీయ క్రీడాకారుల వద్దకు స్వయంగా వచ్చిన రాహుల్ గాంధీ.. వారు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపటం ఆసక్తికరంగా మారింది.

నిరసనలు చేస్త్తూనే.. రోజువారీగా చేసే వ్యాయామాన్నిచేస్తున్నక్రీడాకారుల వద్దకు వచ్చిన రాహుల్.. వారితో పాటు కలిసి వ్యాయామం చేశారు. వారి వేదనను.. డిమాండ్లను సావధానంగా వినటం ద్వారా.. ప్రధాని హోదాలో మోడీ చేయలేని పనిని.. రాహుల్ అంతో ఇంతో చేశారని చెప్పాలి. ఇదో దెబ్బ అయితే.. సార్వత్రిక ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ముంచుకొస్తున్న వేళ.. రాహుల్ గాంధీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. "భారత న్యాయ యాత్ర" పేరుతో ఆయన తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. భారత జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్ర సాగనుంది.

జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఇటీవల రగిలిన మణిపూర్ నుంచి ముంబయి వరకుఆయన యాత్ర చేయనున్నట్లుగా ప్రకటించారు. మణిపూర్ నుంచి ముంబయికి 6200కి.మీ. ఉంటుంది. ఈ యాత్రలో మహిళలు.. యువత.. బలహీనవర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నారు. మణిపూర్ లో మొదలయ్యే ఈ న్యాయయాత్ర.. నాగాలాండ్.. అసోం.. మేఘాలయ.. పశ్చిమబెంగాల్.. బిహార్.. జార్ఖండ్.. ఒడిశా.. ఛత్తీస్ గఢ్.. ఉత్తరప్రదేవ్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. గుజరాత్ మీదుగా మహారాష్ట్రకు చేరనుంది. ఈ యాత్రను చూస్తే.. అత్యధికంగా హిందీ బెల్ట్ లో ఉంది.

ఈసారి పాదయాత్రలా కాకుండా బస్సు యాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. మధ్యమధ్యలో పాదయాత్రను కూడా చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబరులో భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. మొత్తంఐదు నెలల పాటు సాగిన ఈ యాత్రలో రాహుల్ 4500కి.మీ. నడిచారు. సదరు యాత్ర దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు సాగితే.. ఈసారి తూర్పు నుంచి పశ్చిమానికి సాగనుంది. ఇదంతా చూస్తు.. రాహుల్ దూకుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటే.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు.