Begin typing your search above and press return to search.

ఈ సారి ఈస్ట్ నుంచి వెస్ట్ కి పోలా... అదిరిపోలా .....

మణిపూర్ నుంచి ముంబై వరకు ఉన్న 6,200 కిలోమీటర్ల మార్గంలో కొంత భాగం కొండ ప్రాంతాలు. ఇక్కడ వేలాది మంది జనంతో పాదయాత్ర సాధ్యం కాదు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 7:12 AM GMT
ఈ సారి ఈస్ట్ నుంచి వెస్ట్ కి పోలా... అదిరిపోలా .....
X

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిరుడు భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టారు. 4 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఈ పాదయత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఇది సూపర్ సక్సెస్ కావడంతో.. రెండో విడతకు రాహుల్ సిద్ధమయ్యారు. అటు జోడో యాత్ర తనలో నాయకుడిగా పరిణతి తెచ్చిందని రాహుల్ చెప్పారు. కాగా.. రాహుల్ 2024 సార్వత్రిక ఎన్నికల వేళ రెండో దశ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

అహ్మదాబాద్ నుంచి కాదు.. ఆ పేరూ కాదు

భారత్ జోడో యాత్ర రెండో విడతకు పేరు మారింది. ఈసారి భారత్ న్యాయ యాత్రగా పేరుపెట్టారు. వాస్తవానికి రెండో విడత యాత్రను గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు చేపట్టాలని మొదట భావించారు. కానీ, ఇప్పుడు యాత్ర రూటు మారింది. ఈశాన్యం నుంచే మొదలుకానుంది. సంక్రాంతి నుంచి మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. 14 రాష్ట్రాల మీదుగా సాగనుంది. మొత్తం 6 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మధ్యలో బస్సులోనూ ప్రయాణించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఉన్న 6,200 కిలోమీటర్ల మార్గంలో కొంత భాగం కొండ ప్రాంతాలు. ఇక్కడ వేలాది మంది జనంతో పాదయాత్ర సాధ్యం కాదు. దీంతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.

మణిపూర్ ను ఎంచుకుని ..

ఈ ఏడాది మణిపూర్ లో కుకీ, మైతేయీ తెగల మధ్య చెలరేగిన జాతుల ఘర్షణ ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలుసు. మహిళలను నగ్నంగా ఊరేగించడం, ఇళ్లకు నిప్పంటించడం, అత్యాచారాలు ఇలా కొన్ని నెలల పాటు మణిపూర్ అగ్ని గుండంగా మారింది. ఇప్పుడు రాహుల్ అక్కడినుంచే వ్యూహాత్మకంగా పాదయాత్ర చేపట్టనున్నారు. మణిపూర్ లో ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నందున.. రాహుల్ యాత్రకు న్యాయ యాత్ర అని పేరు పెట్టడం గమనార్హం.

తూర్పు నుంచి పశ్చిమం

తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు ‘భారత్‌ న్యాయ యాత్ర’ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తారు. నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో యాత్ర జరుగుతుంది. గతేడాది సెప్టెంబరు 7న రాహుల్‌ గాంధీ.. భారత్‌ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. దాదాపు ఐదు నెలల పాటు 4500కి.మీల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్‌లోని లాల్‌ చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేసి దీనిని ముగించారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలిపారు. అప్పుడు దక్షిణ భారత్‌ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్‌.. ఈ సారి తూర్పు నుంచి పశ్చిమం వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.