Begin typing your search above and press return to search.

సోనియాకు రాహుల్‌ అరుదైన గిఫ్ట్‌!

కాగా రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి అరుదైన బహుమతిని అందించారు. 'నూరీ' అనే జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌ కుక్కపిల్లను గిఫ్టుగా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 7:01 AM GMT
సోనియాకు రాహుల్‌ అరుదైన గిఫ్ట్‌!
X

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే దాదాపు 30 పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటులో రాహుల్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చిన రాహుల్‌ ఈ మ్యాజిక్కును త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాం, తెలంగాణలోనూ రిపీట్‌ చేయాలని భావిస్తున్నారు.

కాగా రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి అరుదైన బహుమతిని అందించారు. 'నూరీ' అనే జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌ కుక్కపిల్లను గిఫ్టుగా ఇచ్చారు. ఈ అరుదైన బహుమతి ద్వారా తన తల్లి సోనియాను రాహుల్‌ ఆశ్చర్యపరిచారు.

తన తల్లికి టెర్రియర్‌ కుక్కపిల్లను ఇస్తున్న వీడియోను రాహుల్‌ గాంధీ తన యూట్యూబ్‌ చానల్‌ లో పోస్టు చేశారు. అలాగే, తన గోవా పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. గోవాలో రాహుల్‌ గాంధీ నూరీ (కుక్క పిల్ల)ని కలుసుకున్నారు. దాన్ని తన తల్లికి ప్రత్యేక బహుమతిగా అందించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఆడ కుక్కపిల్లను ఓ అట్టపెట్టెలో పెట్టి సోనియా ముందుంచి తెరవమని కోరారు. పెట్టెను తెరచిన వెంటనే సోనియాగాంధీ ముఖంలో ఎనలేని సంతోషం కనిపించింది. కుక్కపిల్లను అమాంతం ఎత్తుకొని, కుమారుడు రాహుల్‌ను ప్రేమగా హత్తుకున్నారు. ఈ కుక్కపిల్లకు 'నూరీ' అని పేరు పెట్టారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ గోవాలో నూరీని కలవడం నుంచి సోనియాకు అందించేవరకు జరిగిన పరిణామాలతో ఓ వీడియో రూపొందించారు. అక్టోబరు 4న 'ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం' సందర్భంగా ఆ వీడియోను రాహుల్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేయగా.. అది వైరల్‌ అవుతోంది. తమ కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వచ్చింది అని రాహుల్‌ తెలిపారు. సోనియా వద్ద ఇప్పటికే 'లాపో' అనే శునకం ఉండగా.. ఇప్పుడు దానికి నూరీ కూడా జత కలిసింది.

జంతువులు నేర్పించే ప్రేమ, విధేయత మనను కట్టిపడేస్తాయంటూ రాహుల్‌ నూరీని తమ సరికొత్త కుటుంబ సభ్యునిగా పరిచయం చేశారు. తన కుమారుడు రాహుల్‌ అందించిన గిప్టును సోనియా ఆనందంతో స్వీకరించడం, రాహుల్‌ కు థ్యాంక్స్‌ చెప్పడం, ఇప్పటికే సోనియా వద్ద ఉన్న లాపోతో నూరీ సరదాగా గడపటం వంటివి రాహుల్‌ గాంధీ పోస్టు చేసిన వీడియోలో ఉన్నాయి.

ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. రాహుల్‌ గాంధీకి తన తల్లి సోనియా అంటే ఎంత ప్రేమ అని నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. అలాగే మూగ జీవాలు అంటే రాహుల్‌ కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు. రాహుల్‌ గాంధీ పోస్టు చేసిన వీడియోకు భారీ ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.