Begin typing your search above and press return to search.

అమిత్ షా.. వాల్మీకిని మించిన‌ పెద్ద ర‌చ‌యిత!

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రామాయ‌ణం రాసిన వాల్మీకి క‌న్నా.. అమిత్‌షా పెద్ద ర‌చ‌యిత అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:30 AM GMT
అమిత్ షా.. వాల్మీకిని మించిన‌ పెద్ద ర‌చ‌యిత!
X

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రామాయ‌ణం రాసిన వాల్మీకి క‌న్నా.. అమిత్‌షా పెద్ద ర‌చ‌యిత అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఆయ‌న‌కు చ‌రిత్ర‌లో మిగ‌ల‌డం అల‌వాటు లేదు. చ‌రిత్ర‌ను మాత్రం త‌ప్పుగా అర్థం చేసుకుని.. ఆ త‌ప్పుల‌తోనే చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నారు. ఆయ‌న వాల్మీకిని మించిన పెద్ద ర‌చ‌యిత‌" అని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో పార్ల‌మెంటులో అమిత్ షా మాట్లాడారు.

దేశ తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్‌ విషయంలో ఘోర తప్పదాలకు పాల్పడ్డారంటూ అమిత్‌షా విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న చేసిన త‌ప్పుల్లో పాకిస్థాన్‌తో యుద్ధాన్ని కీల‌క స‌మ‌యంలో ఆపేయ‌డం, ఈ స‌మ‌స్య‌ను ఐక్య‌రాజ్య‌స‌మితికి నివేదించ‌డ‌మ‌ని షా వ్యాఖ్యానించారు. దీనిపైనే రాహుల్ గాంధీ కార్న‌ర్ చేశారు. అమిత్‌షాకు చరిత్ర తిరగరాసే అలవాటు ఉందని వ్యంగ్యోక్తులు విసిరారు.

"నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఏళ్ల తరబడి జైళ్లలో ఉన్నారు. అమిత్‌షాకు చరిత్ర తెలియదు. తెలుసుకుంటారని కూడా నేను ఆశించడం లేదు. అయితే, చరిత్రను తిరగరాయడం ఆయనకు అలవాటుగా మారింది'' అని మంగళవారం నాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. ప్రజా సమస్యలను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయ‌న వాల్మీకిక‌న్నా గొప్ప ర‌చ‌యిత అని వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు అమిత్‌షా వాదనను కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తప్పుపట్టారు. అమిత్‌షా పూర్తి అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ఇండియన్ ఆర్మీ కమాండర్-ఇన్‌-చీఫ్ రాయ్ బుచెర్ అప్పటి ప్రభుత్వానికి ఇచ్చిన సలహా మేరకే కాల్పుల విరమణ చోటుచేసుకుందని చెప్పారు. దీనిలో నెహ్రూ పాత్ర లేద‌ని వ్యాఖ్యానించారు. చ‌రిత్ర తెలుసుకోకుండా అమిత్ షా త‌ప్పులు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.