Begin typing your search above and press return to search.

రాహుల్‌ గాంధీ ఆస్తులు భారీగానే.. లెక్కలివి!

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 12:30 PM GMT
రాహుల్‌ గాంధీ ఆస్తులు భారీగానే.. లెక్కలివి!
X

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ ఎంపీగా రాహుల్‌ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని కాంగ్రెస్‌ కంచుకోట అమేథి నుంచి, కేరళలోని వయనాడ్‌ నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. వయనాడ్‌ లో మాత్రం విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆయన వయనాడ్‌ నుంచే పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన రాహుల్‌ ఈసారి ఒకే ఒక్క స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రాహుల్‌ నామినేషన్‌ ను కూడా ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన సోదరి ప్రియాంకతో కలిసి వెళ్లిన రాహుల్‌ రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందించారు.

కాగా రాహుల్‌ గాంధీ తన ఆస్తులను రూ.20 కోట్లుగా చూపారు. తన మొత్తం నికర సంపద రూ.20 కోట్లని వెల్లడించారు. ఇందులో రూ.9.24 కోట్లు చరాస్తులు కాగా రూ.11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

చరాస్తుల్లో బాండ్లు–షేర్ల రూపంలో రూ.4.33 కోట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ లో రూ.3.81 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడివిట్‌ లో తెలిపారు. అలాగే తనకు రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లతోపాటు రూ. 61.52 లక్షల విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్, పోస్టల్‌ సేవింగ్స్, బీమా పాలసీలు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా రూ.15.21 లక్షల విలువైన గోల్డ్‌ బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు, రూ.55 వేల నగదు ఉన్నట్లు తెలిపారు. అలాగే రూ.2022–23లో తన వార్షికాదాయం రూ.కోటి ఉందని పేర్కొన్నారు.

స్థిరాస్తుల్లో భాగంగా ఢిల్లీలోని మెహ్రౌలీలో తనకు వ్యవసాయ భూమి ఉన్నట్లు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. ఇందులో తన చెల్లెలు ప్రియాంక గాంధీకి కూడా వాటాలున్నాయని పేర్కొన్నారు. ఇది తమకు వారసత్వంగా దక్కిన ఆస్తి అని వెల్లడించారు.

అదేవిధంగా హరియాణాలోని గురుగ్రామ్‌ లో రూ.9 కోట్ల విలువ చేసే కార్యాలయం ఉందన్నారు. ఇక తనకు అప్పులు రూ.49.7 లక్షలు ఉన్నట్టు పేర్కొన్నారు.

అలాగే రాహుల్‌ పై నమోదైన కేసుల వివరాలను కూడా వెల్లడించారు. తనపై బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్‌ కేసుల వివరాలను ఎన్నికల అఫిడివిట్‌ లో వివరించారు.