Begin typing your search above and press return to search.

పప్పు రాహుల్.. ప్రచారం కుట్ర 159 సెకన్ల వీడియో చూస్తే అర్థమవుతుంది!

ఒక కుక్కను తెలివిగా చంపాలంటే ముందు దాన్ని పిచ్చిదిగా ముద్ర వేయటమే కాదు.. అందరూ నమ్మేలా ప్రచారం చేయాలి

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:19 AM GMT
పప్పు రాహుల్.. ప్రచారం కుట్ర 159 సెకన్ల వీడియో చూస్తే అర్థమవుతుంది!
X

ఒక కుక్కను తెలివిగా చంపాలంటే ముందు దాన్ని పిచ్చిదిగా ముద్ర వేయటమే కాదు.. అందరూ నమ్మేలా ప్రచారం చేయాలి. పిచ్చి కుక్కను చంపితే ఎవరు మాత్రం అభ్యంతరం చెబుతారు. రాజకీయాల్లోనూ అంతే. బలమైన వారిని.. భవిష్యత్తుకు తమకు అడ్డు వస్తాడన్న ఆలోచన ఉన్న వారిపై తప్పుడు ప్రచారం చేయటం కనిపిస్తుంటుంది. కోట్లాది మంది ప్రజలు నమ్మేలా ప్రచారం జరిగిన తీరు ఒకలా.. వాస్తవంలో సదరు ప్రముఖుడు మరోలా ఉండే రేర్ సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ తరహాలో బాధితుడిగా నిలిచిన వారిలో మొదటి వరుసలో ఉంటారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

యూపీఏ చేతిలో పవర్ ఉన్నప్పుడు.. అధికారం ఉన్నప్పటికీ ఎలాంటి అవినీతి మరక అంటుకోని రాహుల్ గాంధీని పప్పుగా.. అమూల్ బేబీగా.. రాజకుమారుడిగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తన మీద ముద్రలు వేస్తున్న ప్రత్యర్థులపై రాహుల్ పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. ఈ కారణంగా ఆయన నష్టపోయింది ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది. రాహుల్ గురించి మంచి ప్రచారం జరగకున్నా ఫర్లేదు కానీ.. నెగిటివిటీ.. చేతకాని వాడన్న ముద్ర వేయటమే అసలుసిసలు సమస్య.

2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొన్నాళ్లకు కానీ రాహుల్ టాలెంట్ ఏమిటన్న విషయం అర్థం కాలేదు. జోడో యాత్రలో భాగంగా యావత్ దేశాన్ని ఒక రౌండ్ వేసిన సందర్భంలో రాహుల్ శక్తి సామర్థ్యాలతో పాటు.. అప్పటివరకు ఆయన ఇమేజ్ ను ఎంత దారుణంగా ప్రచారం చేశారన్న విషయం అర్థమవుతుంది. నిజానికి దేశంలోని చాలా మంది రాజకీయ వారసుల్లో కనిపించని అధికార దాహం రాహుల్ లో కనిపించదు. ఈ కారణంగానే తమ చేతిలో అధికారం ఉన్నప్పటికి.. అత్యున్నత పదువుల్ని చేపట్టి.. తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకునే పనులు చేయలేదు.

అంతేకాదు.. విషయాల మీద ఆసక్తి.. పేదలు.. అణగారిన వర్గాల మీద సహానుభూతి చాలా ఎక్కువన్న విషయం చాలా ఆలస్యంగా కానీ బయటకు రాలేదు. అప్పటికే రాహుల్ అన్నంతనే పప్పు.. యువరాజు.. అమూల్ బేబీ అన్న పేర్లను పెట్టేసి తప్పుడు ప్రచారం చేపట్టటం తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా తనకు లభించిన అవకాశాన్ని వదులుకోకుండా.. తన మీద పడిన ముద్రను చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. అలా అని పని కట్టుకొని మరీ ఆ ఇమేజ్ కోసం పాకులాడని వైనం రాహుల్ ప్రత్యేకతగా చెప్పాలి.

తాజాగా ఆయనకు సంబంధించిన 159సెకన్ల వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాలేజీ విద్యార్థినులతో మాట్లాడిన రాహుల్.. తనకు ఎదురైన ప్రశ్నల్ని ఆయన ఎంత ఇన్ స్టెంట్ గా.. నేచురల్ గా చెప్పారో చూస్తే.. రాహుల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి పెద్ద ప్రాజెక్టే చేసినట్లుగా అనిపించక మానదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత రాజస్థాన్ లోని మహారాణి కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినుతలు అడిగిన ప్రశ్నలకు సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా సమాధానాలు చెప్పేసిన వైనం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పలు అంశాల మీద మాట్లాడిన ఆయన.. తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను.. అభిరుచుల్ని సైతం పంచుకున్నారు. మీడియా సమావేశంలో మాదిరి.. తాజా భేటీలోనూ రాహుల్ పెళ్లి పైన ప్రశ్నను ఎదుర్కొన్నారు. మీరు చాలా అందంగా.. స్మార్ట్ గా ఉంటారన్న ఒక విద్యార్థిని పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించగా.. ‘తాను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తలమునకలైనందున పెళ్లి వైపు ఆలోచన చేయలేదు’ అని బదులిచ్చారు.

మీకు ఇష్టమైన ఆహారం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. కాకరకాయ.. పచ్చ బఠాణి.. పాలకూర మినహాయించి ఇంకేమైనా తింటానని బదులిచ్చారు. స్కిన్ కు ఎలాంటి క్రీం రాస్తారు? అని ప్రశ్నించగా.. తాను ఎలాంటి లోషన్లు రాయనని.. ముఖానికి సబ్బు కూడా పెట్టనని.. మంచినీళ్లతోనే కడుక్కుంటానని పేర్కొనటం గమనార్హం. కొత్త ప్రదేశాల్ని చూడటం నచ్చుతుందన్న రాహుల్.. తాను అప్పటివరకు వెళ్లని కొత్త ప్రాంతాల్ని చూసేందుకు ఆసక్తి అని చెప్పుకొచ్చారు. పురుషుల.. మహిళల మధ్య తేడా లేదని.. ఇరువురు సమానమేనని.. వారి శక్తిసామర్థ్యాలు సైతం తక్కువే కాదన్న ఆయన.. యువత ఏ రీతిలో ఉంటుందన్న విషయాన్ని వారికి తెలిపారు. ఈ చిన్న వీడియోను చూసిన తర్వాత రాహుల్ ను పప్పు అంటూ ప్రచారం చేసే వారి వ్యూహం ఇట్టే అర్థం కాక మానదు.