Begin typing your search above and press return to search.

ఇది రాహుల్ అవతార్...మొత్తంగా మారిన తీరు !

ఆయన ఎపుడూ ఏదో ఒక చోట సామాన్యులతో కలసిపోతూ కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే రాహుల్ గాంధీ ఎత్తినన్ని అవతారాలు ఏ రాజకీయ నాయకుడు ఎత్తలేదేమో అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   30 Sep 2023 12:30 AM GMT
ఇది రాహుల్ అవతార్...మొత్తంగా మారిన తీరు !
X

ఆయన కాంగ్రెస్ లో మకుటం లేని మహరాజు. గాంధీ నెహ్రూల వంశీకుడు. అంతా పూలపానుపులే. కానీ ఆయన తన దారి రహదారి కాదని అనుకున్నారు అలా చేస్తే తాను అంతపురాలలోనే ఎప్పటికీ ఉండిపోతాను అని భావించి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. నాలుగు వేల కిలోమీటర్లను సునాయాసంగా తిరిగారు. అలా జనంలోకి వచ్చిన రాహుల్ ఇపుడు జనమే తానుగా మారిపోయారు.

ఆయన ఎపుడూ ఏదో ఒక చోట సామాన్యులతో కలసిపోతూ కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే రాహుల్ గాంధీ ఎత్తినన్ని అవతారాలు ఏ రాజకీయ నాయకుడు ఎత్తలేదేమో అనిపిస్తుంది. ఆయన రైతు అయ్యాడు, కూలి అయ్యాడు, ఒకటా రెండా దశవతారాలు ఆయనే ఎత్తేశారు.

ఒక విధంగా రాహుల్ గాంధీ ప్రజలలో ఈ విధంగా మమేకం అవుతూ చర్చనీయాశం అవుతున్నారు. ఆయన అవతరాలు బహురూపాలు చూస్తూంటే జనాలకు ముచ్చటతో పాటు ఏదో తెలియని ఆసక్తి ఏర్పడుతోంది. దేశంలో బలమైన ప్రధానిగా చరిష్మాటిక్ లీడర్ గా నరేంద్ర మోడీ ఉన్నారు. దంతో ఆయన్ని ఢీ కొట్టాలంటే దుస్సాహసంగానే ఉంది.

ఈ నేపధ్యంలో రాహుల్ కొత్త దారి ఎంచుకున్నారు. దేశాలన్నీ చుట్టేసి ప్రధాని విశ్వ నేతగా ఖ్యాతిని అందుకుంటున్న వేళ రాహుల్ గాంధీ దేశంలో మారుమూల ప్రాంతాలలో కలియతిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటూ తన ఇమేజ్ ని మరో రూపంలో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల రాహుల్ గ్రాఫ్ గతంలో కంటే చాలానే పెరిగింది అని చెప్పాలి.

రాహుల్ విషయానికి వస్తే ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో రైల్వే కూలీలతో కలసి బరువుని నెత్తిన పెట్టుకుని మోసి వారి మనిషిగా మారిపోయారు. అదే విధంగా బిలాస్ పూర్ నుంచి చత్తీస్ ఘడ్ వరకూ మొత్తం 110 కిలోమీటర్ల రైల్వే ప్రయాణాన్ని సాధారణ ప్రజలతో చేసి ఒక సగటు రైల్వే ప్రయాణీకుడి అవతారం కూడా ఎత్తేశారు.

ఇంకో వైపు చూస్తే ఢిల్లీలోని కీర్తినగర్ లో ఒక చోట కార్పెంటర్ గా మారిపోయారు రాహుల్. తనది కాని పనిని తన సొంతం చేసుకుంటూ ఎంతో నేర్పుగా ఓర్పుగా చక్కలు కోస్తూ రాహుల్ అదే పనిలో తదేక దీక్షలో కనిపించారు. అంతే కాదు ఢిల్లీ నుంచి చండీఘర్ వరకూ ఒక ట్రక్కుని ఆయన కొద్ది సేపు నడిపి ట్రక్కు డ్రైవర్ అవతారం కూడా ఎత్తేశారు.

ఇక హరియాణా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఏకంగా ఒక వరిపోలంలోకి దిగి నాట్లు వేస్తూ సగటు రైతుగా కనిపించి అందరినీ మురిపించారు. అంతే కాదు రాజస్థాన్ లోని జైపూర్ లోని కళాశాల విద్యార్ధినులకు స్కూటీలను పంపిణీ చేసిన అనంతరం ఒక విద్యార్ధిని వెనక రాహుల్ గాంధీ కూర్చుని బైక్ మీద కొంత దూరం ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరచారు.

ఇక ఆ మధ్య టమోటా ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో దానికి నిరసనగా సామాన్యులతో కలసి చేసిన ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని ఒక కూరగాయల మార్కెట్ లో ఆయన కూరగాయలు అమ్మే వ్యాపారిగా అవతారం ఎత్తేశారు. అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న వేళ ఒక్కసారిగా రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశారు. చాలా వేగంగా ఆయన కొద్ది దూరం పరుగులు తీసి అందరిలో ఆనందం నింపారు.

ఆ మధ్య లఢక్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ అక్కడ విద్యార్ధులతో తాను కూడా కలసిపోయి ఒక విద్యార్ధిగా ముచ్చట్లు పెట్టారు. బైక్ మీద కూర్చుని వారితో భేటీ వేసి బెస్ట్ స్టూడెంట్ అంటే తానే అనిపించుకున్నారు. ఢిల్లీలోని కరోర్ భాగ్ లోని ఒక మెకానిక్ షాప్ లో రాహుల్ గాంధీ బైక్ మెకానిక్ అవతారం ఎత్తారు. దీక్షగా ఆయన బైక్ రిపేర్ చేస్తూ కనిపించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా రాహుల్ గత ఏడాది కాలం నుంచి జనం మధ్యన ఉంటూ వారితో సంభాషిస్తూ వారి మనిషిగా మారిపోతున్నారు. దాంతో ఆయన ఒకప్పటి యువరాజు కాదు నేల మీద నడయాడే సగటు మనిషి అన్న భావనను అయితే కలిగించగలిగారు. ఈ దేశ జనాభా 143 కోట్లకు పైగా ఉంది. అందులో తొంబై శాతం పైగా మధ్యతరగతి పేదలే ఉన్నారు. వారి సమస్యలు కష్టాలు తెలుసుకోకుండా వాటి మీద అవగాహన లేకుండా దేశాన్ని పాలించడం బహు కష్టం.

ప్రధాని నరేంద్ర మోడీ అయితే పేదరికం నుంచే వచ్చారు. పేదరింలో బతికారు, సామాన్యుడిగా ఉంటూ అలా ఉన్నత పదవుల దిశగా అడుగులు వేశారు. కానీ రాహుల్ గాంధీ అలా కాదు, గోల్డెన్ స్పూన్ తో పుట్టారు.అందుకే ఆయన ఇపుడు సగటు మనిషిగా మారాలని చూస్తున్నారు. ప్రతీ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఆయన పాస్ అయితే మాత్రం ఆయనకూ ఒక మంచి అవకాశం వస్తుంది అని అంటున్నారు.