తెలంగాణ సంపదను మోడీ మిత్రులు పంచుకుంటున్నారు: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
By: Tupaki Desk | 10 April 2025 8:24 AM ISTతెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని పోతోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు.. కుల గణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీలో కుల గణన బిల్లు పెట్టి.. బీసీలకు రిజర్వేషన్ పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని.. అయితే, దీనిని ఆమోదించేందుకు మోడీ ప్రభుత్వానికి మనసు రావడం లేదని దుయ్యబట్టారు. దీనికి కారణం.. బీజేపీ పాలితరాష్ట్రాల్లో ప్రజలకు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని.. వాటిని ఇవ్వకుండా అడ్డుకునేందుకే మోడీ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాని కి అడ్డు పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లు.. కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. అందుకే.. తమ ప్రభుత్వం పంపించిన బిల్లును మోడీ సర్కారు తొక్కి పెడుతోందని దుయ్యబట్టారు.
తెలంగాణలో 90 శాతం మంది ఓబీసీలు,దళిలు, మైనారిటీలేనన్న రాహుల్ గాంధీ.. వారికి చెందిన సంపదను కూడా.. మోడీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. సమాజంలో 10 శాతం ఉన్న కార్పొరేట్లు.. తెలంగాణ సంపదను అనుభవిస్తు న్నారని తెలిపారు. అందుకే తెలంగాణ ప్రజలు వెనుకబడుతున్నారని చెప్పారు. ``రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్ణయాలను కేంద్రం తొక్కి పెడుతోంది. కుల గణన బిల్లుకు ఆమోదం తెలిపి.. రిజర్వేషన్లు పెంచాలని భావించినా.. మోకాలడ్డుతోంది. ఇది ప్రజాస్వామ్య పాలన అని ప్రచారం చేసుకుంటున్నారు. పైగా.. తెలంగాణ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు`` అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
