రాహుల్...కేటీఆర్...లోకేష్..ఈ పోలిక ఎందుకంటే ?
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత. ఆయన 2004లో తన 34 ఏళ్ళ వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
By: Tupaki Desk | 20 May 2025 6:00 AM ISTరాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత. ఆయన 2004లో తన 34 ఏళ్ళ వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటికి అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి అమేధీలో ఓడారు కూడా. రాహుల్ ది రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. ఆయన ఈ క్రమంలో గాంధీ కుటుంబ వారసుడిగా ఏకంగా ప్రధాని పదవినే చేపట్టాల్సి ఉంది.
ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి తొలుత రాజ్యసభ మెంబర్ గానే ప్రవేశించారు. అనతికాలంలోనే ఆమె కేంద్ర మంత్రి అయి రెండేళ్ళు తిరగకుండానే ప్రధానిగా 1966 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అంటే కేవలం నాలుగైదేళ్ళ స్పాన్ లోనే ఆమె అగ్రాసనం అధిరోహించారు అన్న మాట. ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే 1981లో కాంగ్రెస్ ఎంపీగా అమేధీ నుంచి గెలిచారు. 1984లో ఆయన డైరెక్ట్ గా ప్రధాని అయిపోయారు. అంటే కేవలం మూడేళ్లలోనే అసలు కేంద్ర మంత్రి కూడా చేయకుండానే ఉన్నతాసనం అందుకున్నారు అన్న మాట. ఇక రాహుల్ గాంధీ చూస్తే ఎప్పటికీ ఎంపీగానే ఉన్నారు.
దానికి కారణం ఆయన యూపీయే వన్ టూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేసి ఉంటే ఆ ప్రభుత్వం రెండవ టెర్మ్ లో కచ్చితంగా ప్రధాని అయి ఉండేవారు. కానీ రాహుల్ గాంధీ అప్పట్లో పదవుల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు, సోనియాగాంధీ సైతం 2014లో రాహుల్ ప్రధాని అని ఒక వ్యూహంతో ముందుకు సాగారు. అలా ఆమె ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి బీజేపీ మూడు సార్లు గెలిచింది. గత పదకొండేళ్ళుగా బీజేపీ ఏలుబడిలో దేశం ఉంది.
దాంతో రాహుల్ కి ప్రధాని పదవి అందని పండు అవుతోంది. 2029 నాటికి ఆయనకు ఆ పదవి దక్కితే ఓకే. కానీ లేకపోతే మరి ఎప్పటికి అందుతుంది అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనికి కారణం యూపీయే రెండు టెర్ములు అధికారంలో ఉండగా చేతిలో అవకాశం ఉండగా రాహుల్ గాంధీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్నది రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా వారసులు ఎదిగి వచ్చిన పార్టీల అధినేతలకు రాహుల్ ఎపిసోడ్ ఒక హెచ్చరికగా మారుతోందిట.
కట్ చేస్తే తెలంగాణాలో బీఆర్ఎస్ లో మరో వారసుడు కధ ఇలాగే ఉంది. ఆయనే కేటీఆర్. కేసీఆర్ కి రెండు సార్లు జనాలు ఆదరించి అధికారం అప్పగించారు. అయితే కేసీఆర్ తాను రెండవ టెర్మ్ సీఎం గా ఉండగా కేటీఆర్ కి పట్టాభిషేకం చేసి సీఎం గా చేస్తారు అని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి కానీ ఎందుకో అది అలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వెనక కూడా కేసీఆర్ తమ కుమారుడిని సీఎం గా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేందుకే అని కూడా అంటూ వచ్చారు.
అయితే 2023లో జరిగిన ఎన్నికల వరకూ వేచి చూసి కేటీఆర్ కి సింహాసనం అప్పగిస్తారు అన్నది కూడా వినవచ్చింది. తీరా 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణమైన పరాజయం మూటకట్టుంది. దాంతో మరో అయిదేళ్ళ పాటు కేటీఆర్ ఎదురుచూడాల్సి వస్తోంది అని అంటున్నారు.
ఈ రెండు ఎపిసోడ్స్ ఇపుడు ఎందుకు అంటే ఏపీలో టీడీపీలో వీటి మీదనే ఎపుడూ చర్చ సాగుతూ వస్తోందిట. లోకేష్ టీడీపీకి వారసుడిగా ఉన్నారు. ఆయనకు పార్టీలో ఎవరూ పోటీలో లేరు. అయితే ఆయన పట్టాభిషేకానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది అని అంటున్నారు.
అయితే లోకేష్ కి ఉన్నత పదవులు దక్కాలని కోరుకునే వారు ఆయన అభిమానులు మాత్రం పై రెండు ఎపిసోడ్స్ చూపించి ఆలస్యం పదవికి మరింత దూరం అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారుట. మహానాడులో లోకేష్ ని టీడీపీకి భావి వారసుడిగా ప్రకటించాలని ఒక డిమాండ్ అయితే అంతర్లీనంగా ఉందిట.
మరి ఉప ముఖ్యమంత్రిగా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉండాలని అది పవన్ కే ఇవ్వాలని ఒక షరతు మీదనే జనసేనతో టీడీపీ పొత్తు కుదిరింది అని అంటున్నారు. దాంతో ఉప ముఖ్యమంత్రి పదవి రెండవది ఉండదని అంటున్నారు. పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వవచ్చు కానీ జనాలు మ్యాండేట్ ఇచ్చింది చంద్రబాబుకే. అలాగే పార్టీ జనాలలో సీనియర్లు తటస్థులు ఇంకా బాబు మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారుట. మొత్తం మీద చూస్తే కనుక లోకేష్ కి ఏ పదవి ఇస్తారు అన్నది చర్చగా ఉంది.
ఏది ఏమైనా లోకేష్ బాబు తరువాత వారసుడు అన్నది మాత్రం తెలుస్తూనే ఉంది. చేతిలో పదవి ఉంది, కానీ అది అందడానికే ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. సో దేశంలో ఇతర వారసుల విషయంలో జరిగిన తప్పులు లోకేష్ విషయంలో జరగకుండా వీలైనంత తొందర పడాలని హితైషులు కోరుతున్నారుట. మరి అది ఎపుడు జరుగుతుంది ఏమిటి అన్నది చర్చగానే ఈ రోజుకి ఉంది.
